రెండు గుడ్‌మార్నింగ్‌లకు ఓ గుడ్‌న్యూస్

by srinivas |   ( Updated:2020-02-18 04:29:21.0  )
రెండు గుడ్‌మార్నింగ్‌లకు ఓ గుడ్‌న్యూస్
X

మూడు రోజుల్లో రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి రెండ్రోజుల్లోనే గుడ్‌న్యూస్ వచ్చింది. ఫస్ట్ టైం హస్తినా టూర్‌లో ప్రధాని మోడీ, సెకండ్ టైమ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన జగన్.. కీలక విషయాలపై చర్చించి వచ్చారు. శాసనమండలి రద్దు, మూడు రాజధానుల అంశం, తెలంగాణ నుంచి ఏపీకి పలువురు అధికారులను పంపించాలన్న విజ్ఞప్తికి కేంద్రం పచ్చజెండా ఊపి జగన్‌కు పుష్ అప్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ సీఎం అయినప్పటి నుంచి తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి కేటాయించాలని చేసిన ప్రయత్నాలకు సెంట్రల్ ఓకే చెప్పి గ్రీన్‌‌సిగ్నల్ ఇచ్చింది.

1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. రాయలసీమలో కూడా పలు బాధ్యతలు చేపట్టి మంచిపేరు సంపాదించుకున్నారు. దీంతో జగన్ సీఎం కాగానే తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వెళ్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ ఐపీఎస్ అధికారికి ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌‌గా లేదా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా అడుగు ముందుకు పడలేదు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఓకే చేయించుకున్నా జగన్‌కు కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో ఈ విషయం మరుగున పడ్డట్లు అయ్యింది. కానీ, ఇటీవల అనూహ్యంగా ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర పెద్దలతో కీలక మంతనాలు జరిపిన వైఎస్ జగన్.. స్టీఫెన్‌ రవీంద్రను ఏపీకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.

శాసనమండలి రద్దు, మూడు రాజధానులు, పలువురు అధికారులను ఏపీకి పంపించాలని ప్రధాని మోడీ, అమిత్‌ షాకు విన్నవించిన జగన్.. స్టీఫెన్‌ను ఏపీకి తెచ్చుకొని కేంద్రం వద్ద మంచి సఖ్యత సాధించినట్లు పలువురు భావిస్తున్నారు. దీంతోపాటు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లు ఆమోదం పొందడంతోపాటు మూడు రాజధానులకు ఆర్థికసాయంపై ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక వైసీపీ, బీజేపీ పొత్తుపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. జగన్ కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటారా లేకుంటే బీజేపీకి బయట నుంచి మద్దతు తెలుపుతూ అనుకున్నవి సాధించుకుంటారా అన్నది కీలకంగా మారింది. మరో వైపు స్టీఫెన్ రవీంద్ర ఏపీకి వెళ్లడానికి లైన్ క్లియరైన నేపథ్యంలో అతనికి ఏపదవి కట్టబెడుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed