ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేస్తున్నాయి: శైలజానాథ్

by srinivas |
ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేస్తున్నాయి: శైలజానాథ్
X

దిశ,విశాఖపట్నం: కేంద్రంలోని మోడీ ,రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పోలీసులు నిర్ధాక్షిణ్యంగా,కిరాతకంగా విరుచుకుపడటం పట్ల శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ బిల్లులు కేవలం కార్పొరేట్లకు మాత్రమే లాభంచేకూరుస్తాయని అన్నారు. రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కేంద్రంలోని పెద్దలకు కొంచెం కూడా సానుభూతి లేదని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వం అనాగరికంగా ఆమోదింపచేసుకున్నవ్యవసాయాభిల్లుల వల్ల రైతులు తమ సొంత పొలంలోనే కూలీలుగా మారతారని శైలజానాథ్ తెలిపారు. కార్పొరేట్లకు మార్కెటింగ్ ఏజెంట్‌గా కేంద్రం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేసారు. దాదాపు అన్నిరాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులను జగన్ కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకోసమే మద్దతిచ్చారని మండిపడ్డారు.

ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని,రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పి అసెంబ్లీలో బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. వ్యవసాయ బిల్లులను అన్నదాతలకు ఉరితాళ్లుగా ఆయన అభివర్ణించారు. కోట్లాది మంది రైతులు వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ అనుకూల బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రైతుల ఆందోళనలకు శైలజానాథ్ పూర్తి మద్దతు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed