నదీ జలాల వివాదంపై నాన్చుతారా.. తేల్చేస్తారా..?

by Shamantha N |
నదీ జలాల వివాదంపై నాన్చుతారా.. తేల్చేస్తారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతరాష్ట్ర జల వివాదాలపై కేంద్రం మరోసారి దృష్టి సారించింది. తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న నీళ్ల వివాదాన్ని నాన్చుతూనే​… తమిళనాడుకు గోదావరి నీటిని తరలించే అంశాన్ని పరిష్కరించుకునేందుకు ముందుకు కదులుతోంది. మార్చి 4న తిరుపతిలో నిర్వహించనున్న దక్షణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండాగా పేర్కొంటోంది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ప్రాజెక్టుల అంశం మండలి ఎజెండాలో ప్రాధాన్యత పొందనుంది.

ప్రాజెక్టుల స్టేటస్​ఏంటి..?

కృష్ణా బేసిన్ పై రెండు తెలుగు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై వివాదం నడుస్తోంది. ప్రధానంగా తెలంగాణ చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలు, గుండ్రేవుల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం తప్పు పడుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లు ఇవ్వాలని కేంద్రం ఇరు రాష్ట్రాలను అడుగుతూనే ఉంది. కృష్ణా బోర్డు సైతం లేఖలు పంపింది. కానీ డీపీఆర్ లు సమర్పించకుండానే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఈ అంశాన్ని కేంద్రం దక్షణాది రాష్ట్రాల జోనల్​కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా చేర్చింది. ఇదే సమయంలో కేంద్రం మళ్లీ కృష్ణా బోర్డును తాజా నివేదికలు కోరింది. దీంతో రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు పంపినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వలేదంటూ లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో..

తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నదుల అనుసంధానాన్ని ఎజెండాలో చేర్చింది. ఇప్పటికే చెన్నైకి కృష్ణా బేసిన్​నుంచి ఏపీలోని పోతిరెడ్డిపాడు ద్వారా 15 టీఎంసీలు కేటాయించినా.. ప్రతి సారీ మూడు టీఎంసీలు దాటకపోవడంతో వివాదం కొనసాగుతూనే ఉంది. తమిళనాడుకు గోదావరి–కావేరి నదుల అనుసంధానమే శరణ్యమంటూ ఆ రాష్ట్రం కేంద్రానికి చెప్పింది. త్వరలోనే ఇక్కడ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం దీనికి ప్రయారిటీ ఇస్తోంది. గోదావరిలో మిగులు జలాలు లేవని, మహానది–గోదావరి అనుసంధాన ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాతే గోదావరి–కావేరిపై ముందుకు వెళ్లాలని ముందునుంచే తెలంగాణ చెబుతోంది. కర్ణాటక, ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి కర్ణాటక–తమిళనాడు మధ్య కావేరీ జలాల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకు గోదావరి జలాలను తరలించి వివాదాలకు చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. గోదావరి–కావేరీ అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది.(ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట) అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట)) గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది.

ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే జలాల్లో ఏపీకి 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 1,486.155 టీఎంసీలను కేటాయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మూడు ప్రత్యామ్నాయాల్లోనూ గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే తీసుకుంది. కానీ, దీని ప్రకారం గోదావరిలో మిగులు జలాలు లేవనీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేస్తూ, ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. వచ్చేనెల 4న నిర్వహించే సదరన్​ సమావేశంలో జల వివాదాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రాలకు ఎజెండా అంశాలను పంపించింది. నదీ జలాల వివాదాల అంశంలో ఇప్పటికే ఒకే దేశం–ఒకే ట్రిబ్యునల్​కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. కానీ దీనిని మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కృష్ణా, గోదావరి బోర్డులు ఎజెండా అంశాలను కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ సెక్రటరీకి, రెండు తెలుగు రాష్ట్రాలకు పంపించాయి. మరోవైపు ప్రాజెక్టుల వారీగా స్టేటస్​రిపోర్టులు ఇవ్వాలని కృష్ణా బోర్డు అడిగినా… ఇంకా ప్రభుత్వం రిప్లై ఇవ్వలేదు. దీనిపై సీఎం కేసీఆర్​తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story