ఇంకా వాటి లెక్క చెప్పరేందీ ?

by Shyam |
ఇంకా వాటి లెక్క చెప్పరేందీ ?
X

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ ప్రారంభమై నెలరోజులు గడిచింది. ప్రభుత్వం నిషేధించిన మద్యం అమ్మకాల, రవాణా కేసులు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఒక్క నిజామాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో మద్యం దుకాణాలు, బార్‌లలోని మద్యాన్ని యజమానులే పక్కదారి పట్టించారు. ఈ జిల్లాలో మద్యం దొంగతనాల కేసులకు సంబంధించి నమోదైన కేసులు మరే ఇతర జిల్లాలో నమోదు కాలేదంటే అతిశయోక్తి కాదు. మద్యం పక్కదారి పడుతున్నదని ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆబ్కారీ శాఖ మద్యం దుకాణాలకు సీల్ వేసినా మద్యం అమ్మకాలు మాత్రం ఆగలేదు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నప్పటికీ అందులో మద్యం మాత్రం మాయమైంది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిజామాబాద్ మద్యం సిండికేట్ మాఫియా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు చేసింది. రాత్రికి రాత్రే మద్యం దుకాణాలను, బార్‌లను తెరిచి మాద్యాన్ని ఖాళీ చేశారు. చిన్నా,చితకగా దొరికిన వారిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలను తెరిచి మద్యాన్ని తరలించి బ్లాక్ లో విక్రయించిన దుకాణాలపై తీసుకోవాల్సిన చర్యల వ్యవహరం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు.

మద్యం ఇలా మాయం…

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ లో గల కపిల వైన్స్ ను తెరిచి మద్యాన్ని తరలించారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. స్టాక్ వివరాలను పరిశీలించింది. తరువాత సీల్ వేసింది అంతే. నగరంలోని త్రీస్టార్ హోటళ్లు, పలు బార్ లలో మద్యం రాత్రికి రాత్రే ఖాళీ అయ్యింది. బార్‌లలో పనిచేసే వారితో కమీషన్ ప్రాతిపదికన అమ్మకాలు చేయించారు. మద్యం దుకాణాలను రాత్రికి రాత్రే తెరిచి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడంతో మద్యం ధరలు రెండింతలవడంతో లైసెన్స్ దుకాణాలు, బెల్ట్ షాపుల వారికి పంట పండింది. ఏప్రిల్ 15న నగరంలోని వినాయక్ నగర్ న్యూ హౌజింగ్ బోర్డులో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించిన గోదాములో రూ. 4.5 లక్షలు విలువ చేసే మద్యం పట్టుబడింది. ఆ మద్యం స్థానిక ఆర్య నగర్ లోని ఎంఎస్ఆర్ బార్ కు సంబంధించినదిగా గుర్తించి అందుకు బాధ్యులుగా ప్రభుత్వ ఉద్యోగి మధు సూదన్ రెడ్డి, వినిత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లపై నాల్గవ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

16న నిజామాబాద్ నగరంలో ఆర్మూర్ రోడ్డులో ఉన్న సాయిప్రభ లిక్కర్ మార్ట్ లో, బైపాస్ రోడ్డులోని మహాదుర్గా వైన్స్ లో మద్యం దొంగతనయత్నం జరిగిందని యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 19న నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ వద్ద డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న రూ. లక్ష విలువైన మద్యాన్ని నవీపేట్ పోలీసులు పట్టుకున్నారు. వర్నీ వైన్స్ లో పనిచేసే వెంకటేశ్వర రావు అనే వ్యక్తితో పాటు వ్యాన్ డ్రైవర్ రాజేష్ లపై పోలీసులు అక్రమ మద్యం రవాణా కేసులను నమోదు చేశారు. అదే రోజు నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలోని ఎస్ఎల్ఎన్ వైన్స్ లో మద్యాన్ని ఎత్తుకెళ్లారని యజమానులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 19న నిజామాబాద్ నగరంలోని వర్నీ రోడ్డులో మద్యాన్ని అక్రమంగా తరలించారనే అనుమానంతో జి.బి వైన్స్ లో ఆబ్కారీ శాఖ అధికారులు సోదాలు చేశారు.

రెండు శాఖల మధ్య పేచీ..

మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, నియంత్రణ, నిషేధం వంటి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలది. కానీ, లాక్‌డౌన్ తరువాత మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, మద్యం అమ్మకాల నియంత్రణలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. మద్యం దొంగతనాల కేసులు, వారి తనిఖీల్లో పట్టుబడిన కేసులు.. పోలీస్ శాఖకు పట్టుబడిన మద్యం ఎక్కడిది..? ఏ దుకాణానిది..? అనే కోణంలో విచారణ చేయాల్సింది ఆబ్కారీ శాఖనే. అయితే.. లాక్‌డౌన్ కాలంలో పట్టుబడిన మద్యం వ్యవహారానికి సంబంధించి ఆబ్కారీ శాఖనే విచారణ చేయాలి. కానీ, తాత్సారం కొనసాగుతున్నది. మద్యం కేసుల విచారణ ఆలస్యం కావడంతో కేసుల నుంచి తప్పించుకునేందుకు పట్టుబడ్డ మద్యం దుకాణాల యజమానులు చేయని ప్రయత్నాలు లేవు.

సిండికేట్ కను సన్నళ్లలోనే…!

నిజామాబాద్ జిల్లాలో లైసెన్స్ మద్యం దుకాణాల నుంచే మద్యం తరలింపు అమ్మకాలు జరిగాయని పట్టుబడిన మద్యం స్టిక్కర్లు, హోలో గ్రాంలు సాక్ష్యం చెబుతున్నాయి. కానీ, ఇప్పటివరకూ ఆ కోణంలో ఆబ్కారీ శాఖ చర్యలకు ఉపక్రమించలేదు. మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడడంతో తమ వైన్స్, బార్ లలో దొంగతనం జరిగిందంటూ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఏదైన కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందని ఆరా తీయగా పోలీస్ శాఖ విచారణను సాకుగా చూపిస్తున్నారు.

మద్యం పట్టుబడిన ప్రతిసారీ మద్యం సిండికేట్ లో కీలక వ్యక్తులు పోలీస్, ఆబ్కారీ శాఖ లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. మద్యం దుకాణాల్లో సింహాభాగం అధికార పార్టీ సానుభూతి పరులు, నేతలవే కావడం ఇందుకు కారణమని తెలుస్తోన్నది. కేసుల నమోదులో వ్యక్తులను తొలిగించాలని, దొరికిన మద్యం స్థాయి తగ్గించాలనే ప్రయత్నాలకు కొదవలేదు. ఓ వ్యాపారి, ఒక విద్యావేత, మరో ప్రముఖ వ్యాపారీ.. అంతా తామై మద్యం కేసులు జఠిలం కాకుండా చేశారనడంలో అతిశయోక్తి కాదు. మద్యం దొరికిందని మీడియా ద్వారా విషయం బయటకు పొక్కితే గానీ కొన్ని కేసులు నమోదు చేయలేదు. అక్రమ మద్యం అమ్మకాల కేసులు తారుమారు కోసం ఒక్కో దుకాణం యజమానుల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేశారు అనే వినికిడి ఉంది. ఆలస్యంగానైనా ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్థానిక మద్యం వ్యాపారులతో తమ అధికారులు మిలాఖాత్ అయ్యారని గుర్తించి స్టాక్ వివరాలు, విచారణ, ఇతర విషయాల గురించి ఇతర ప్రాంతాల ఇన్‌స్పెక్టర్లను నియమించడం కొసమెరుపు. మద్యం అమ్మకాలు అక్రమ తరలింపు కేసులలో నెలరోజులు గడిచినా సంబంధిత మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోకపోవడంపై వస్తున్న విమర్శలకు ఆబ్కారీ శాఖాధికారుల మౌనమే సమాదానమైంది.

Tags: Nizamabad, Department of Excise, Police, Illegal Liquor, Case Record, Wines and Bars

Advertisement

Next Story

Most Viewed