లేటెస్ట్ కరెంట్ అఫైర్స్..

by Vinod kumar |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్..
X

ఆర్‌బీఐ.. క్లీన్ నోట్ పాలసీ:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2000 నోటును ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని మే 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చకోవచ్చని వెల్లడించింది. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకుంది.

గంగానదిలో కలిసే కాలువలకు జియో ట్యాగింగ్:

గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాల నుంచి వ్యర్థాలతో ప్రవహించే అన్ని కాలువలనూ జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేయనున్నారు. ఘన వ్యర్థాలు గంగా నదిలో కలవకుండా నిరోధించేందుకు ఈ చర్యను చేపట్టనున్నారు. వ్యర్థాలపై తక్షణ చర్యలు చేపట్టేందుకుగానూ జియో ట్యాగింగ్ ఉన్న అన్ని కాలువలకు సంబంధించిన సమాచారాన్ని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌లకు పంపిస్తారు. గంగానది ఒడ్డున శిథిలాలు, ఘన వ్యర్థాలను పారబోస్తున్న కారణంగా అవి నదిలో కలుస్తున్నాయని, దీనివల్ల ప్లాంట్లలో నీటి శుద్ధి ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఘన వ్యర్థాలను అడ్డుకోవడానికి తెరల ఏర్పాటుకు అమృత్ 2.0 ద్వారా నిధులు సమకూరతాయని జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు.

ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా శేషసాయి:

ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేషసాయి నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియమానికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

మోదీకి గినియా, ఫిజి అత్యున్నత పురస్కారాలు:

పపువా న్యూ గినియాలో నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే. ఈ సందర్భంగా తొలి పపువా న్యూగినియాతో పాటు ఫిజి దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ఆయనను సత్కరించాయి. విదేశీయులకు ఈ అవార్డులు ఇవ్వటం చాలా అరుదు. ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు అవార్డును మోదీకి బహుకరించారు. ఈ పురస్కారం అందుకున్న వారిని గినియా వాసులు చీఫ్ బిరుదుతో పిలుస్తారు. అంతకుముందు ఫిజి ప్రధాని సిటివేని రెబుకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజిని మోడీ మెడలో వేసి గౌరవించారు.

సల్మాన్ రష్టీకి పెన్ సెంటినరీ కరేజ్ అవార్డు:

బుకర్ ప్రైజ్ విజేత అయిన అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్టీ (75) న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్‌లో గల అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో జరిగిన 2023 లిటరసీ గాలాకు హజరయ్యారు. ఈ సందర్భంగా పెన్ సెంటినరీ కరేజ్ అవార్డుతో ఆయనను సత్కరించారు. పెన్ అమెరికా సంఘానికి గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు.

27వ సారి ఎవరెస్టు అధిరోహించిన పాసన్గ్ దావా :

పాసన్గ్ దావా అనే షెర్పా (పర్వాతారోహకుల గైడ్) 27వ సారి ఎవరెస్టు ఎక్కి ఇప్పటివరకు కామి రీటా పేరు మీద ఉన్న రికార్డును సమం చేశాడు. 46 ఏళ్ల పాసన్గ్ ఎవరెస్టు శిఖరాన్ని 27వ సారి అధిరోహించారని ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ - 2023 జాబితా:

బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు 222వ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్‌లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవడంతో వారి ఆస్తిలో రూ. 2,069 కోట్లు కోల్పోవడమే ఇందుకు కారణమని ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ - 2023 ప్రకటించింది. నిరుటి జాబితాలో రూ. 7,104 కోట్లతో 275వ స్థానంలో ఉన్న రిషి, అక్షత దంపతులు ఈ ఏడాది రూ. 5,448 కోట్లతో 222వ స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో ఎప్పటిలాగానే హిందూజా సోదరులు తొలిస్థానంలో ఉన్నారు. గతేడాది వారి ఆదాయం పెరగడంతో ఆస్తి మొత్తం ఏకంగా రూ. 36.04 లక్షల కోట్లకు చేరింది.

100 గంటల్లో 100 కి.మీ రహదారి నిర్మాణంతో రికార్డు:

దిశ,కెరీర్: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ - అలీగఢ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం రికార్డు సృష్టించింది. కేవలం 100 గంటల్లో 100 కి.మీ పొడవైన రహదారిని నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ అధికారికంగా వెల్లడించింది. రహదారి నిర్మాణంలో పాలు పంచుకున్న వారిని అభినందించేందుకు నిర్విహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఎన్ హెచ్34లో గాజియాబాద్ - అలీగఢ్ మధ్య 118 కి.మీ పొడవైన మార్గం ఎంతో కీలకం. ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్ టెక్నాలజీని వినియోగించి, దాదాపు 90 శాతం గ్రీన్ టెక్నాలజీ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed