కొంపముంచిన కేర్ టేకర్..

by Sumithra |
కొంపముంచిన కేర్ టేకర్..
X

దిశ, కూకట్‌పల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడి వద్ద కేర్ టేకర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నట్టేటా ముంచాడు. రెండేండ్ల పాటు నమ్మకంగా ఉన్న ప్రబుద్ధుడు ఇంట్లోని రూ.7.8 లక్షలతో పరారయ్యాడు. సీఐ లక్ష్మినారాయణ కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన డి.వేణు గోపాల రాధాకృష్ణ ఈ నెల 1వ తేదీన తన బంధువు అయిన సురపనేని మోహన్ రావు(75) ఇంట్లో రూ.7.8 లక్షలు చోరీకి గురయ్యాయని కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు.

కేర్ టేకర్‌గా పని చేస్తున్న శశి కిరణ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తనపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని హెచ్ఐజీ-458, గణేష్ ప్లాజా 4వ అంతస్థులోని ఫ్లాట్ నంబర్ 01లో నివాసముంటున్న మోహన్ రావు(75) గత కొన్నేళ్లుగా పక్షవాతం బారిన పడి చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆయన బాగోగులు చూసేందుకు కేర్ టేకర్ కోసం సైనిక్‌పురిలోని వీ కేర్ ఏజెన్సీని 2018లో సంప్రదించారు. వారు కొత్తగూడెం జిల్లా మార్వాడి క్యాంప్‌కు చెందిన మెరుగు శషి కిరణ్(34)ను కేర్ టేకర్‌గా పంపించారు. అతను రెండేళ్ల పాటు నమ్మకంగా ఉన్నాడు. మోహన్ రావుకు సంబంధించిన అన్ని పనులతో పాటు ఇంటిని శుభ్రం చేస్తూ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రమంలో మోహన్ రావుకు సంబంధించిన డబ్బులను సీతారామ్ అనే వ్యక్తి ఇంట్లోని మరో బెడ్ రూం బీరువాలో ఉంచడాన్ని గమనించిన శషి కిరణ్ వాటిని కాజేయాలని పథకం పన్నాడు. పది రోజుల కిందట ప్లాన్ ప్రకారం బీరువాలోని రూ.7.8 లక్షలను తీసుకుని పరారయ్యాడు. నాటి నుంచి విధులకు హాజరు కాలేదు. దీంతో మోహన్ రావు వీ కేర్ ఏజెన్సీని సంప్రదించగా వేరే వ్యక్తిని పంపిస్తామని చెప్పారు.

గత నెల 30న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మోహన్ రావు బంధువు సీతరామ స్వామి ఇంటికి రంగులు వేయించడానికి కావలపిన డబ్బులు తీయడానికి బీరువ తెరవగా అందులో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో సీతారామ స్వామి రాధాకృష్ణకు కాల్ చేసి సమాచారమిచ్చాడు. ఇంటికి వచ్చి పరిశీలించిన ఆయన ఈనెల 1 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు శషి కిరణ్ కోసం గాలింపు ప్రారంభించి సైనిక్‌పురిలోని వీ కేర్ ఏజెన్సీ వద్ద శషి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. విలాసాలకు తన జీతం చాలక అతను దొంగతానానికి పాల్పడినట్టు సీఐ లక్ష్మినారాయణ తెలిపారు. దొంగిలించిన డబ్బులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసిన అనంతరం మిగిలిన రూ.6,75000లతో నగరానికి చేరుకున్నాడు శషి కిరణ్. అతడి నుంచి రూ.6,75000 స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. కేసును చేధించిన డీఐ నాగేశ్వర్ రెడ్డి, క్రైం సిబ్బంది పురందాస్, పూర్ణ చందర్లను సీఐ అభినందించారు.

Advertisement

Next Story