జగన్ బాటలో త్రివేంద్ర సింగ్ రావత్

by srinivas |   ( Updated:2020-03-05 04:02:28.0  )
జగన్ బాటలో త్రివేంద్ర సింగ్ రావత్
X

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాటలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తరువాత జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే.. మరో రెండు రాజధానుల ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ రాజధాని, లెజిస్లేటివ్ రాజధాని, లా రాజధాని ఇలా మూడు విభాగాలను కేంద్రాలుగా విభజిస్తూ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనితాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో విలసిల్లనుంది.

మూడు రాజధానుల ప్రకటనపై ఆయన వివరణ ఇస్తూ, పర్వత ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గతంలో గైర్సైన్‌ను రాజధానిగా చేయాలంటూ పోరాటం చేశానని ఆయన అసెంబ్లీకి గుర్తుచేశారు. ప్రజల మనోభావాల నేపథ్యంలోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇకపై వేసవిలో గైర్సైన్‌లోనే పాగావేసి పాలన కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు.

కాగా, త్రివేంద్ర సింగ్ రావత్ మూడు రాజధానుల నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆదర్శంగా నిలిచినట్టు కనిపిస్తోంది. భారతదేశంలో రాజధాని, పరిపాలన వికేంద్రీకరణ వంటి సంచలన నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధైర్యంగా తీసుకున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం ఇంకెన్ని రాష్ట్రాలకు ఆదర్శం కానుందో చూడాల్సి ఉంది.

Tags: aap, uttarakhand, jagan, trivendra singh rawat h, 3 capitals

Advertisement

Next Story

Most Viewed