ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

by Harish |
ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన డేటా ప్రకారం, భారత టోకు ధరల సూచీ(WPI) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 0.27 శాతం నుంచి ఫిబ్రవరిలో 0.2 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఇంధనం, విద్యుత్, ఉత్పాదక ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం అందుకు దోహదపడ్డాయి. ఇది ఆర్థికవేత్తల అంచనాలకు అనుగుణంగానే నమోదైంది. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఉల్లి, బంగాళాదుంపల ధరలు పెరగడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 6.85 శాతం నుంచి ఫిబ్రవరిలో 6.95 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇంతకుముందు డిసెంబర్ నెలలో ఇది గరిష్ట స్థాయి 9.38 శాతంగా నమోదైంది.

కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో 19.71 నుంచి 19.78 శాతానికి, పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 16.06 శాతం నుంచి 18.48 శాతానికి పెరిగింది. అదే ఫిబ్రవరిలో ఆహారేతర వస్తువుల ధరలు మాత్రం 6.92 శాతం తగ్గాయి, ఇంధనం-విద్యుత్ ధరలు 1.59 శాతం, తయారీ ఉత్పత్తుల ధరలు 1.27 శాతం తగ్గాయి. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఒక బేసిస్ పాయింట్ తగ్గి 5.09 శాతానికి చేరింది, ఇది జనవరి నెలలో 5.1 శాతంగా ఉంది. ఇది ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను 6.5 శాతం వద్ద ఉంచింది.

Advertisement

Next Story

Most Viewed