Mudra Loans: ముద్ర రుణ పరిమితి రెట్టింపు

by Mahesh Kanagandla |
Mudra Loans: ముద్ర రుణ పరిమితి రెట్టింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముద్ర లోన్(Mudra Loans) పరిమితిని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు గరిష్టంగా ఈ స్కీం కింద రూ. 10 లక్షల రుణాలు అందిస్తున్నది. ఇప్పుడు ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ(Finance ministry) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లోనే ముద్ర లోన్ పరిమితి పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(FM Nirmala Sitharaman) ప్రకటించారు.

ప్రధాన మంత్రి ముద్ర యోజనా(పీఎంఎంవై) పథకం కింద మూడు కేటగిరీల్లో రుణాలు అందిస్తారు. శిశు రుణాల కేటగిరీలో రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర రుణాల కేటగిరీలో రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇక తరుణ్ రుణాల విభాగంలో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ పొందుతారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ గరిష్ట పరిమితినే రూ. 10 లక్ష ల నుంచి రూ. 20 లక్షలకు పెంచింది. ఈ స్కీంలో తరుణ్ ప్లస్ అనే కేటగిరీని చేర్చి.. ఇందులో రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్లు అందిస్తామని తాజా ప్రకటనలో కేంద్రం తెలిపింది. తరుణ్ కేటగిరీలో రుణం పొంది విజయవంతంగా సకాలంలో రుణాన్ని చెల్లించినవారికే తరుణ్ ప్లస్ కేటగిరీ(Tarun Plus Category)లో లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించింది.

2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ముద్ర యోజనా పథకాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాకారాన్ని అందించాలనే లక్ష్యంతో.. యువత ఔత్సాహికులకు అండగా నిలవాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం తెచ్చింది. ఈ రుణ సహాయంతో వ్యాపారం విజయవంతంగా నిర్వహించి మరికొందరికి ఉపాధి ఇవ్వాలనేది ఈ స్కీం లక్ష్యంలో అంతర్లీనంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed