Stock Market: స్టాక్ మార్కెట్లకు లాభాల పంట!

by Harish |   ( Updated:2022-05-17 12:24:46.0  )
Stock Market: స్టాక్ మార్కెట్లకు లాభాల పంట!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు చాలా రోజుల తర్వాత భారీ లాభాలను సాధించాయి. వరుస ఆరు సెషన్ల తర్వాత ఈ వారం ప్రారంభంలో లాభాలను చూసిన తర్వాత మంగళవారం సూచీలు మెటల్, ఇంధన రంగాల మద్దతుతో గణనీయంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచే మెరుగ్గా ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు(Stock Market) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో రాణించాయి. ప్రధానంగా గడిచిన 15 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లకు ఇది రెండో మెరుగైన సింగిల్ డే ట్రేడింగ్ కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా చైనాలోని కీలక ప్రాంతం షాంఘైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. చైనా ప్రభుత్వం క్రమంగా లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయనే సూచనలు కనిపించాయి. ఇక, దేశీయంగా కూడా కీలకమైన తయారీ, సేవల రంగం కార్యకలాపాలు పుంజుకోవడం స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,344.63 పాయింట్లు ఎగసి 54,318 వద్ద, నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఐటీ, మీడియా, ఆటో, బ్యాంకింగ్ షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్, ఐటీసీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, మారుతీసుజుకి, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు అత్యధికంగా 2-8 శాతం మధ్య ర్యాలీ చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 77.47 వద్ద ఉంది.

Advertisement

Next Story