ది మ్యాన్ ఫ్రమ్ ది ఎర్త్ రివ్యూ : శాంతి ఇషాన్ సమీక్ష

by M.Rajitha |   ( Updated:2024-11-28 16:01:16.0  )
ది మ్యాన్ ఫ్రమ్ ది ఎర్త్  రివ్యూ : శాంతి ఇషాన్ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : నీతో పాటు పదేళ్ళుగా కలిసి పని చేస్తున్న నీ కొలీగ్ వయసు సడన్ గా 14 వేల ఏళ్ళు అని తెలిస్తే... అదెలా సాధ్యమని విస్తుపోతున్నారా? అతని ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా అలాగే ఆశ్చర్యపోయారు. అస్సలు నమ్మలేదు, వాదించారు, ఆఖరికి అతణ్ణి చంపడానిక్కూడా రెడీ అయిపోయారు. 2007లో రిలీజైన The Man from Earth సైన్స్ ఫిక్షన్ మూవీ సెంట్రల్ థీమ్ ఇది.

సైన్స్ ఫిక్షన్ అనగానే బోలెడు మిస్టరీ, థ్రిల్, అంతకుమించిన గ్రాఫిక్స్ expect చేస్తారేమో! ఈ సినిమా మొత్తం ఒక రూంలోనే నడుస్తుంది. ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవు. థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అసలే కనిపించవు. అయినప్పటికీ మీరు సినిమా ఒకసారి మొదలుపెట్టారంటే చివరి వరకు విడవకుండా చూస్తారు. ఏ ఒక్క డైలాగ్ కూడా మిస్ కావడానికి ఇష్టపడరు. పాత్రల మధ్య జరిగే మేధోపరమైన సంభాషణలు ఆలోచింపచేస్తాయి. సినిమా ముందుకు పోయే కొద్దీ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతుంటారు.

అంతగా ప్రేక్షకులను కట్టిపడేయాలంటే కథ, screenplay ఎంత బలంగా ఉండాలి! ఈ సినిమాకి అలాంటి బలమైన కథ, కథనాలే ప్రాణం. అమెరికన్ స్క్రీన్ రైటర్ జెరోమ్ బిక్స్ బీ (Jerome Bixby) 1960ల్లో ఈ కథ రాసుకోవడం మొదలుపెట్టారు. 1998లో చనిపోవడానికి ముందు పూర్తి చేశారు. ఆ కథ ఆధారంగా రిచర్డ్ షెంక్ మ్యాన్ (Richard Schenkman) ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

జాన్ ఓల్డ్ మ్యాన్ అనే ప్రొఫెసర్ (David Lee Smith) సడన్ గా ఉద్యోగం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అన్నాళ్ళూ అతనితో కలిసి పని చేసిన కొలీగ్స్ సెండాఫ్ పార్టీ ఇవ్వడానికి అతని ఇంటికి వస్తారు. అనుకోకుండా అతను తన గురించి చెప్పడం మొదలుపెడతాడు. అతను ఒక్కొక్కటిగా చెప్పే విషయాలను అతని కొలీగ్స్ జీర్ణించుకోలేరు. అతని మాటలు ఒకరి విశ్వాసాన్ని ప్రశ్నిస్తాయి, ఇంకొకరి చదువును వ్యర్థం చేసేస్తాయి. మరొకరి తార్కిక దృష్టికి సవాలుగా నిలుస్తాయి. మతం, సైన్సు, కళ- అన్నింటి పునాదులనూ కదిలించి వేస్తాయి.

ఒక మనిషి తను అంతవరకు గట్టిగా నమ్మినదాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతగా వ్యాకులపడిపోతాడనడానికి ఇందులోని Edith పాత్ర ఒక ఉదాహరణ. Christianityని ప్రపంచమంతా 2 వేల ఏళ్ళుగా నమ్ముతుంది కదా అని ప్రశ్నిస్తుందావిడ. అప్పుడు 2 వేల ఏళ్ళ కంటే ఎక్కువ కాలం గొప్ప మతాలుగా చెలామణీ అయ్యి కనుమరుగైపోయిన మతాల గురించి మన ప్రొఫెసర్ ఏకరువు పెడతాడు. బుద్ధుడికి, క్రిస్టియానిటీకి ఉన్న సంబంధాన్ని చర్చిస్తాడు. కొందరిని దేవుళ్ళుగా మార్చడానికి వాళ్ళకు మహిమలను ఎలా ఆపాదిస్తారో వివరిస్తాడు.

“The mythical overlay is so enormous and not good. The truth is so, so simple’ అంటాడు జాన్. నిజమే! సత్యం చాలా సరళమైనది. దాని చుట్టూ అల్లుకున్న, అల్లిన కల్పితమైన పొరలు ఆ సత్యం రూపును మెల్లగా మార్చేస్తుంటాయి. చివరికి పూర్తి భిన్నమైన రూపాన్ని తెర మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు.

“Heaven and hell were pedalled so priests could rule through seduction and terror, save our souls that we never lost in the first place”. జాన్ చెప్పిన మాటల్లో ఇది చాలా బలమైనది. ప్రజలను నయానో భయానో మభ్యపెట్టి తమ ఆధిపత్యం కొనసాగించడానికే మతాధికారులు స్వర్గం, నరకాలను సృష్టించాడని అతనంటాడు. మనమెప్పుడూ పోగొట్టుకోని, మన వెన్నంటే ఉన్న మన ఆత్మలను వెతికి పెడతామంటూ అబద్ధపు వాగ్దానాలు చేస్తారని చెప్పుకొస్తాడు.

“A simple path to goodness needs a supernatural roadmap” అని ఇంకో పాత్ర బాధపడుతుంది. అంతే కదా మరి. ఏదైనా మంచిని మంచి అని నేరుగా చెబితే దాన్ని ఎవరూ పట్టించుకోరు. దానికి దైవత్వాన్నో, మానవాతీత శక్తినో ఆపాదిస్తే అప్పుడు నమ్ముతారు, ఆరాధిస్తారు.

‘Piety is not what the lessons bring to people. It’s the mistake they bring to the lessons’ అని జాన్ ఓ చోట అంటాడు. దీనికి చాలా విస్తృతమైన అర్థముంది.

ధర్మం అనేది స్వచ్ఛమైన జ్ఞానం నుంచి పుట్టదు. మనుషులు తమ తమ స్థితి గతులను బట్టి, నేపథ్యాలను బట్టి, విశ్వాసాలను బట్టి, తప్పొప్పులను బట్టి జ్ఞానాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారు. ఆ పరిస్థితుల నుంచి పుట్టేదే ధర్మం. అంటే జ్ఞానం స్వచ్ఛమైనది, శాశ్వతమైనదైతే ధర్మం ఆయా వ్యక్తుల అనుభవాల ఆధారంగా ఉద్భవించినది (subjective phenomenon) అని అర్థం. అందుకే జ్ఞానం ఒక్కటే, ధర్మాలు మాత్రం అనేకం!

“I was raised on the Torah. My wife on the Koran. My oldest son is an atheist. My youngest is a scientologist. My daughter is studying Hinduism. I imagine that there is a room there for a holy war in my living room. But we practise live and let live”

“నేను old testament నియమాలు పాటిస్తే మా ఆవిడ ఖురాన్ ను చదువుతూ పెరిగింది. మా చిన్నబ్బాయి సైంటాలజీని (సత్యాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో అమెరికన్ రచయిత ఎల్ రాన్ హబ్బర్డ్ ప్రతిపాదించిన ఒక మతం) నమ్ముతాడు. మా అమ్మాయి హిందూ మతాన్ని పాటిస్తుంది. నా లివింగ్ రూంలోనే ఒక పవిత్ర యుద్ధం జరిగే ఆస్కారముంది. కానీ మేము ఎవరికి నచ్చినట్లు వాళ్ళం బతుకుతాం. పక్కవాళ్ళను బతకనిస్తాం!”.

ఈ మాట జాన్ కొలీగ్స్ లో ఒకరైన హ్యారీ అంటాడు. మతం వ్యక్తిగతం అని చెప్పడానికి ఇంత కంటే వేరే తార్కాణం కావాలా?

ఇలా మతం గురించిన చర్చే ఈ సినిమాకి ఆయువుపట్టు. రాతియుగం నాటి మనిషి ఒకడు ఇప్పటివరకు నిజంగా బతికుంటే వాడికి మన ఆరాటాలు, పోరాటాలు, మత మౌఢ్యాలు, యుద్ధాలు ఎంత పిల్ల చేష్టలుగా కనిపిస్తాయో చెప్పే ప్రయత్నం జరిగిందీ సినిమాలో. జాతులు, మతాలు, దేశాలు ఇవన్నీ తాత్కాలికమైన సరిహద్దులే - అవి కాలానుగుణంగా మారిపోతుంటాయి. మనిషి మనిషిగా బతకడమే అసలైన ఉనికి అని చెప్పకనే చెబుతుందీ సినిమా.

నిజానికి 14 వేల ఏళ్ళ నుంచి బతుకుతున్న పాత్ర అనేది “మనిషి”కి metaphor మాత్రమే. రాతి యుగం నాటి నుంచి మానవ జాతిలో జరుగుతున్న మార్పులకు ఇతగాడు ఒక personification! అతను తనవి అని చెబుతున్న అనుభవాలన్నీ broader senseలో మానవ జాతి అనుభవాలే! అతను ఎదుర్కొంటున్న సవాళ్ళు సమస్త మానవ జాతిని పీడిస్తున్న సవాళ్ళే! ఆ విధంగా పైకి సైంటిఫిక్ సినిమా లాగా కనిపించినా ఇందులో ఆధ్యాత్మికత, తర్కం, తత్వ శాస్త్రం, వేదాంతం అన్నీ కలగలిపి ఉన్నాయి. Peripheral levelలో ఒక రకంగా, మరికాస్త లోతుగా వెళ్తే మరో రకంగా, ఇంకా లోతుకు వెళ్తే మరింత అర్థవంతంగా కనిపిస్తుందీ సినిమా.

ఇదంతా చూసి ఈ సినిమా ఏదో బ్రహ్మ పదార్థం అనుకోనక్కరలేదు. ఎలాంటి విజువల్ వండర్స్ లేకుండానే screenplayతో ప్రేక్షకులను ఎలా కట్టిపడేయొచ్చో ఈ సినిమా చెబుతుంది. అందుకే వర్థమాన filmmakers తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అలాగే తమ పరిధిని దాటి ఆలోచించేవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాళ్ళు కూడా ఈ సినిమాని చూడాలి. అలాంటి వాళ్ళ విశ్వజనీనమైన ఆలోచనలను ఈ సినిమా బలోపేతం చేస్తుంది. కానీ విశ్వాసాలే ప్రాణంగా బతికేవాళ్ళు మాత్రం ఈ సినిమా చూడకపోవడమే బెటర్. కాలి కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది మరి!

8 మంది ఆర్టిస్టులతో తీసిన The Man from Earth బడ్జెట్ కేవలం 2 లక్షల డాలర్లు. ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 3 లక్షల డాలర్లు, అంటే రెండున్నర కోట్ల రూపాయలు! వారం రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఎనిమిది రోజుల పాటు షూట్ చేశారు. 2007 శాన్ డీగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో ఈ సినిమాని screen చేశారు. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్షన్ కి గాను బోలెడు అవార్డులు వరించాయి. దీనికి పెద్దగా మార్కెటింగ్ కూడా చేయలేదు. Mouth publicityతోనే నడిచింది. IMDbలో దీని రేటింగ్ 7.8!

క్రాఫ్ట్ పరంగా, కాన్సప్ట్ పరంగా కొత్తదనం కోరుకునేవాళ్ళకి, ఫార్ములాకు భిన్నమైన సినిమాలు ఇష్టపడేవాళ్ళకు ఇప్పటికీ ఎప్పటికీ నచ్చుతుందీ సినిమా!

Thank you Sriram M for suggesting this gem of a movie.

(అన్నట్టూ ఈ సినిమాకి 2017లో The Man from Earth: Holocene పేరుతో సీక్వెల్ వచ్చింది. ఈ రెండు సినిమాలు YouTubeలో ఉన్నాయి)

శాంతి ఇషాన్,

సమీక్షకురాలు

Read More...

Vennela Kishore: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?






Advertisement

Next Story