తెలంగాణలో పాస్ పోర్ట్ ల జారీ వేగవంతం..

by Sumithra |
తెలంగాణలో పాస్ పోర్ట్ ల జారీ వేగవంతం..
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పోర్టుల జారీ వేగవంతం చేసేందుకు ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లలో సేవలు మెరుగపర్చేందుకు గాను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి, హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య, తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి స్నేహజ జొన్నలగడ్డ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) డైరెక్టర్ ఆర్వీఎన్ శ్రీనివాస్ లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు (పీఓపీఎస్కే), 265 పోస్టాఫీస్ ఆధార్ ఎన్‌రోల్‌ మెంట్ సెంటర్‌ (పీఓఏఈసీ)లలో కస్టమర్ సేవలను మెరుగుపర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా వినియోగదారులలో అవగాహన కల్పించడానికి పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల వద్ద సౌకర్యాలు అప్ గ్రేడ్ చేయనున్నారు. ఆధార్ విషయంలో, తెలంగాణ వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లను పూర్తి స్థాయిలో పనిచేసేలా చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా సుముఖత వ్యక్తం చేసింది. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వయస్సు కేటగిరీలలో పిల్లల నమోదు కోసం, పెండింగ్‌లో ఉన్న ఆధార్ కవరేజీని, 5 నుండి 7 సంవత్సరాలు, 15 నుండి 17 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక , మాధ్యమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలలో పోస్టల్ క్యాంపులను నిర్వహించడంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయం చేయనుంది . సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వినియోగదారులకు చేరేందుకు గాను విస్తృతంగా ప్రచారం కల్పించాలని సమావేశంలో పాల్గొన్న ఆయా విభాగాల అధికారులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ (హెచ్‌క్యూ) బి.ఆరుముగం, అకౌంట్స్ పోస్టల్, తెలంగాణ డైరెక్టర్ యూ.సాయి పల్లవి, యుఐడీఎఐ ప్రతినిధులు, పోస్టల్ డిపార్ట్‌మెంట్కు చెందిన ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed