Stock Market: వారాంతం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: వారాంతం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు లాభాల నుంచి పతనమయ్యాయి. ఈ వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లలో ఆల్ టైమ్ రికార్డుల ర్యాలీ కనిపించింది. అయితే, కొత్త గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం సూచీలు బలహీనపడ్డాయి. చైనాలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. తద్వారా మెటల్ షేర్లలో ఉత్సాహం కనిపించింది. అయితే, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్-సెషన్ తర్వాత నుంచి నష్టాలు మొదలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 264.27 పాయింట్లు నష్టపోయి 85,571 వద్ద, నిఫ్టీ 37.10 పాయింట్లు కోల్పోయి 26,178 వద్ద ఉంది. నిఫ్టీలో బ్యాంకింగ్, మీడియా, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. ఫార్మా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, రిలయన్స్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.67 వద్ద ఉంది.

Advertisement

Next Story