Stock Market: వరుసగా మూడోరోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: వరుసగా మూడోరోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల కంటే దేశీయ పరిణామాలు మన సూచీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా దేశంలో పండుగ సీజన్ అమ్మకాలు బలహీనంగా ఉండటం, బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు పెరగడమే కాకుండా రుణాలు తగ్గిపోవడం, త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల కారణంగా కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనికితోడు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలతో వరుసగా మూడో సెషన్‌లో నష్టాలు తప్పలేదు. గురువారం ట్రేడింగ్‌లో కీలక బ్లూచిప్ స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కనబడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 494.75 పాయింట్లు నష్టపోయి 81,006 వద్ద, నిఫ్టీ 221.45 పాయింట్ల నష్టంతో 24,749 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ మినహా అన్ని రంగాలు నీరసించాయి. ఆటో, రియల్టీ రంగాలు 3 శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లె ఇండియా, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.06 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed