Stock Market: అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |   ( Updated:2024-10-09 13:19:24.0  )
Stock Market: అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ నష్టాలు ఎదురయ్యాయి. అంతకుముందు సెషన్‌లో వరుస ఆరు రోజుల నష్టాల తర్వాత లాభాలు నమోదవగా, బుధవారం ట్రేడింగ్‌లో మరోసారి బలహీనపడ్డాయి. ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పదోసారి కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ప్రకటించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఆర్‌బీఐ పాలసీ వైఖరిని తటస్థ స్థితికి సడలించడంతో రానున్న నెలల్లో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చింది. అయితే ఆఖరులో ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు తప్పలేదు. మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం, తద్వారా పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఇన్‌పుట్ ధరలలో అస్థిరత, మార్జిన్‌పై ప్రభావం కారణంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 167.71 పాయింట్లు నష్టపోయి 81,467 వద్ద, నిఫ్టీ 31.20 పాయింట్ల నష్టంతో 24,981 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు సానుకూలంగానే ఉన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.97 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed