- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SEBI: అనిల్ అంబానీపై ఐదేళ్ల నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా
దిశ, బిజినెస్ బ్యూరో: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆయనపై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అలాగే, రూ.25 కోట్ల జరిమానా సైతం విధించింది. ఆయనతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ ముఖ్య అధికారులు, మరో 24 ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ మార్కెట్ నుండి ఐదేళ్ల నిషేధం వర్తించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం అమల్లో ఉన్న కాలంలో రెగ్యులేటర్‌లో నమోదైన ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా మధ్యవర్తిగా డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజర్ పదవులను నిర్వహించకుండా, సెక్యూరిటీస్ మార్కెట్‌తో సంబంధం ఉన్న ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనొద్దని సెబీ ఆంక్షలు విధించింది. అలాగే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుండి ఆరు నెలల పాటు నిషేధించింది, అదనంగా రూ. 6 లక్షల జరిమానా విధించింది.
సెబీ వెల్లడించిన దాని ప్రకారం, అనిల్ అంబానీ ఆయనకు సంబంధించిన సంస్థలకు రుణాల రూపంలో అక్రమంగా ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నిధులను మల్లించారు. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం సూచనలను పట్టించుకోలేదు. సంస్థకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కుట్ర పన్ని అనిల్ అంబానీ నిధులను మళ్లించారు. ఆయన ఒత్తిడి వల్ల కీలక పదవుల్లో ఉన్న వారు అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి ఆయన తన "ADA గ్రూప్ చైర్‌పర్సన్"గా, RHFL హోల్డింగ్ కంపెనీలో పరోక్ష వాటాను ఉపయోగించుకున్నారని సెబీ తెలిపింది.
ఆదాయం తక్కువగా ఉన్న చిన్న కంపెనీలకు వందల కోట్ల విలువైన రుణాలను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు. ఇలా రుణాలు పొందిన కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయి. దీని ఫలితంగా ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణ డిఫాల్ట్ కింద దివాళా పరిష్కారానికి వెళ్లింది. దీంతో 9 లక్షల మంది ఇన్వెస్టర్లతో సహా పబ్లిక్ షేర్ హోల్డర్లు భారీ నష్టాలను చవిచూశారు. మార్చి 2018లో రూ. 59.60గా ఉన్న RHFL షేర్ ధర, మోసం బయటపడడంతో మార్చి 2020 నాటికి రూ.0.75కి పడిపోయింది.
మోసంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ అధికారులు అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలతో సహా 24 నియంత్రిత సంస్థలపై సెబీ జరిమానాలు విధించింది. అంబానీకి రూ.25 కోట్లు, బాప్నాకు రూ.27 కోట్లు, సుధాల్కర్‌కు రూ.26 కోట్లు, షాకు రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్‌జెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి అనేక ఇతర సంస్థలపై కూడా రూ.25 కోట్ల జరిమానా విధించింది.