RBI to launch first pilot for retail digital rupee on December 1

by Harish |   ( Updated:2022-11-29 14:03:47.0  )
RBI to launch first pilot for retail digital rupee on December 1
X

ముంబై: డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతిచ్చేందుకు, కరెన్సీ నోట్లకు జతగా తీసుకొస్తున్న డిజిటల్‌ రూపీని డిసెంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ప్రకటించింది. రిటైల్ అవసరాలకు వినియోగించే ఈ-రూపీని దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదట దీన్ని ప్రారంభిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

ఈ-రూపీ డిజిటల్ టోకెన్ల రూపంలో ఉంటుంది. ఇది ప్రస్తుత కరెన్సీకి సమానంగానే ఉంటుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ-రూపీ రూపం, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ వినియోగం వంటి ప్రక్రియలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత రిటైల్ డిజిటల్ రూపీలో చేసేందుకు అవకాశం ఉన్న మార్పులను సమీక్షిస్తారు.

దీన్ని ముందుగా బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, భువనేశ్వర్ నగరాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా తెస్తామని, ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్, గౌహతీ, లక్నో, పాట్నా వంటి నగరాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ-రూపీ వినియోగానికి ఆయా ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులను గ్రూప్‌గా ఏర్పాటు చేయనున్నారు.

బ్యాంకుల నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి, మొబైల్‌ ఫోన్‌లలోని డిజిటల్ వ్యాలెట్లలో ఉంచుకోవచ్చు. దాన్ని వ్యక్తి నుండి వ్యక్తికి, అలాగే వ్యక్తి నుంచి వ్యాపారులకు బదిలీ చేసుకోవచ్చు. దీన్ని క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా లావాదేవీ నిర్వహించవచ్చు. వాలెట్లలో నిల్వ ఉంచిన ఈ-రూపీకి ఎలాంటి వడ్డీ రాదు. కానీ రిటైల్ ఈ-రూపీని వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్‌లుగా మార్చుకునేందుకు వీలుంది.

ఇక, ఈ-రూపీ పైలట్ ప్రాజెక్టు కోసం ఆర్‌బీఐ ఎనిమిది బ్యాంకులను ఎంపిక చేసింది. వాటిలో ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంకులు మొదట ప్రారంభిస్తాయి. అనంతరం కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు చేరనున్నాయి. కాగా, ఆర్‌బీఐ టోకు అవసరాలకు వినియోగించే ఈ-రూపాయిని నవంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story