పెట్రోల్ పంప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. లైసెన్స్, అర్హత, పూర్తి వివరాలు ఇవే

by Harish |   ( Updated:2023-04-23 06:48:39.0  )
పెట్రోల్ పంప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. లైసెన్స్, అర్హత, పూర్తి వివరాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: కూర్చొని హాయిగా చేతినిండా సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ విషయంలో బాగా గుర్తుకు వచ్చేది అంటే పెట్రోల్ పంప్‌ బిజినెస్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నంత డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా అతి ఎక్కువ జనాభా కలిగిన భారత్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్‌పై కమీషన్ రూపంలో ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతానికి ప్రతి పెట్రోల్ పంప్ డీలర్లకు సగటున లీటర్‌ పెట్రోల్‌పై రూ.3 పైనే లాభం వస్తుంది.

ఈ బిజెనెస్‌లో పెట్రోల్ ధరల హెచ్చుతగ్గుల గురించి అవగాహన, గతంలో ఏదైనా బిజినెస్ తాలూకు అనుభవం ఉంటే హాయిగా పెట్టుబడి పెట్టి కూర్చున్న చోట నుండే బాగా సంపాదించవచ్చు. అయితే కొంతమంది ఈ బిజినెస్ ఎలా పెట్టాలి, దానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, అనే వివరాలు తెలియక కన్‌ఫ్యూజ్ అవుతారు. అలాంటి వారి కోసం పెట్రోల్ పంప్ బిజినెస్ గురించి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.


పెట్రోల్ పంప్ బిజినెస్ మొదలుపెట్టాలంటే ఏరియా, డిజైన్, మెటీరియల్స్, బంక్ సైజ్‌ను బట్టి దాదాపుగా రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు అవుతుంది. ఒక వేళ ల్యాండ్ వారి పేరు మీద ఉంటే మాత్రం తక్కువలో అయిపోతుంది. లేదంటే మాత్రం ల్యాండ్ ఖర్చు అదనంగా అవుతుంది. బ్యాంకులు కూడా ఈ బిజినెస్ కోసం అర్హత ఆధారంగా రూ. 50000 నుండి రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి.

దీనిలో ముఖ్యంగా ల్యాండ్ బాగా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ పెట్టాలంటే సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 800 చదరపు మీటర్లు, రెండు డిస్పెన్సింగ్ యూనిట్లకు 1200 చదరపు మీటర్ల భూమి అవసరం అవుతుంది. అదే, అర్బన్ ప్రాంతాల్లో సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 500 చదరపు మీటర్లు, రెండు డిస్పెన్సింగ్ యూనిట్లకు 800 చదరపు మీటర్ల భూమి కావాలి. నేషనల్ హైవేల ప్రక్కన అయితే సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు1200 చదరపు మీటర్లు, రెండు డిస్పెన్సింగ్ యూనిట్లకు 2000 చదరపు మీటర్ల భూమి అవసరం అవుతుంది.


దరఖాస్తుదారుని వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు గ్రామీణ ప్రాంతాల్లో రూ.100, మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.1000 వరకు ఉంటుంది. SC, ST, OBC కేటగిరీలకు చెందిన వారికి అప్లికేషన్ ఫీజులో 50 శాతం తగ్గింపు ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. అభ్యర్థిని లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు దారుని విద్యార్హత: 10వ తరగతి పాసై ఉండాలి.



స్థలానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ, లైసెన్సింగ్ అథారిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్ (MCD) అండ్ ఫైర్ సేఫ్టీ ఆఫీస్ నుండి అనుమతి ఉండాలి. లైసెన్స్ పొందిన తర్వాత, GST చెల్లించడానికి GSTIN నంబర్‌ను పొందాలి. తర్వాత పెట్రోల్ పంపు పేరుతో కరెంట్ ఖాతా తెరవాలి. IOCL, HPCL,BPCL, రిలయన్స్ వంటి సంస్థల నుంచి పెట్రోల్ పంప్‌ల కోసం లైసెన్స్ పొందవచ్చు.

పెట్రోల్ పంప్ డీలర్‌షిప్ గురించి వెబ్‌సైట్‌ https://www.petrolpumpdealerchayan.in/

Advertisement

Next Story

Most Viewed