Payments: తక్షణ చెల్లింపుల్లో స్కామ్‌కు బలవుతున్న మూడింట ఒక వంతు భారతీయులు

by S Gopi |
Payments: తక్షణ చెల్లింపుల్లో స్కామ్‌కు బలవుతున్న మూడింట ఒక వంతు భారతీయులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ సర్వే ప్రకారం, దేశంలో మూడింట ఒక వంతు మంది రియల్-టైమ్ చెల్లింపుల ద్వారా స్కామ్‌కు గురవుతున్నారని తేలింది. గ్లోబల్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫికో రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో రియల్-టైమ్ చెల్లింపుల్లో మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కంపెనీ నిర్వహించిన సర్వేలో.. 34 శాతం మంది తాము కొనని వస్తువులు, పొందని సేవలు, పెట్టుబడులకు చెల్లింపులు చేసి మోసపోయారు. 60 శాతం మంది స్కామర్ల నుంచి నకిలీ మెసేజ్‌లు వచ్చాయని ఫిర్యాదు చేశారు. 54 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులు స్కామ్‌కు గురైనట్టు చెప్పారు. అయితే, 2023 కంటే 2024లో తక్కువ మంది స్కామ్‌ల బారిన పడినప్పటికీ, ఎక్కువ మొత్తం డబ్బును స్కామర్లు దోచుకున్నారు. గతేడాది రూ. 8 లక్షల కంటే ఎక్కువ విలువైన మోసాలు దాదాపు రెట్టింపు పెరిగాయని ఫికో ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ దత్తు కొంపెల్లా చెప్పారు. మరోవైపు, 56 శాతం మంది రూ. 50,000 కంటే తక్కువ మొత్తంలో పోగొట్టుకున్నారు. కానీ, దానివల్ల ఎక్కువ కుటుంబాలు స్కామర్ల కారణంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారని నివేదిక వివరించింది. దాదాపు 45 శాతం మంది కస్టమర్లు స్కామ్‌ల గురించి అవగాహన పెంచుకుని ముందుగా జాగ్రత్త పడుతున్నారని, దీనికి బ్యాంకులు కూడా మెరుగ్గా సహకరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story