AP: బడ్జెట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

by Ramesh Goud |
AP: బడ్జెట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ (Union Budget) ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు (AP Congress President) వైఎస్ షర్మిల (YS Sharmila) ఎద్దేవా చేశారు. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. కూటమి ప్రభుత్వం (NDA Government)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. బీహార్‌ (Bihar)కి 'ఫుల్', ఏపీకి 'నిల్' అని, ఇది భారత్ బడ్జెట్ కాదు.. బీహార్ ఎన్నికల బడ్జెట్ (Bihar Election Budget)అని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) భారత్ బడ్జెట్‌(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు "కొండంత రాగం తీసి కూసంత పాట" పాడినట్లుందని విమర్శించారు.

NDA భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న నితీష్ (Nithish) బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు (Chandrababu)కి, మోడీ చిప్ప చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. అంతేగాక బీహార్‌ను అందలం ఎక్కించి, ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇక బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా (Speacial Status) ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని, రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ఇప్పుడు రూపాయి సహాయం లేదని తెలిపారు.

పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం లేదని, విభజన హామీలను తుంగలో తొక్కారని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమలు కేటాయించలేదని, మెట్రో రైల్ ప్రాజెక్టు (Metro Train Project)ను పట్టించుకోలేదని, కడప స్టీల్ (Kadapa Steel) ఊసే లేదని చెప్పారు. రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఏపీకి ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదని అన్నారు. అవసరం ఉన్నంత సేపు ఓడమల్లన్న.. గట్టెక్కాక బోడి మల్లన్న.. అని, రాష్ట్ర ప్రజలను మోడీ, బోడి మల్లన్న కింద లెక్క గట్టారని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనత ఈ బడ్జెట్‌తో తేటతెల్లం అయ్యిందని, ఇంత అన్యాయం జరిగితే చంద్రబాబు బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదం అని షర్మిల రాసుకొచ్చారు.


Next Story

Most Viewed