RIL AGM: దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ సేవలు

by S Gopi |
RIL AGM: దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ సేవలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం తన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) నిర్వహించింది. ఈ సమావేశంలో సంస్థ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ప్రధానంగా రిలయన్స్ సంస్థ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చేందుకు ప్రతిపాదించింది. వచ్చే నెల 5న దీన్ని ఆమోదించేందుకు బోర్డు సమావేశం కానుంది. ఈ మేరకు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ సమావేశ ప్రసంగంలో స్పష్టం చేశారు. 35 లక్షల మంది వాటాదారుల ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఏజీఎం సందర్భంగా జియో వినియోగదారులకు రిలయన్స్ సంస్థ శుభవార్త ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలను మొదలవుతాయని ప్రకటించారు. అంతేకాకుండా జియో యూజర్లకు వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ స్టోరేజీని ఉచితంగా ఇవ్వనున్నట్టు ముఖేశ్ అంబానీ తెలిపారు. ఇక, ట్రెండింగ్ టెక్నాలజీ ఏఐ విభాగంలో పోటీ పడేందుకు సంస్థ 'జియో బ్రెయిన్ ' పేరుతో కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించనున్నట్టు ముఖేశ్ అంబానీ చెప్పారు. ప్రస్తుత ఈ ప్లాట్‌ఫామ్‌ను జియో ప్లాట్‌ఫామ్‌లో వాడుతున్నారు.

ఈ సందర్భంగా జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు కంపెనీ కృషి చేస్తుందన్నారు. స్వల్పకాలిక లాభాలు లేదా సంపద కంటే రిలయన్స్ సంస్థ దీర్ఘకాలిక విలువను సాధించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి సంబంధించి ఈ ఏడాదిలోనే తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని తీసుకురానున్న అప్‌డేట్ ఇచ్చారు. ఇదే సమావేశంలో మాట్లాడిన రిలయన్స్ రిటైల్ విభాగం డైరెక్టర్ ఈశా అంబానీ వచ్చే 3-4 ఏళ్లళొ రిటైల్ వ్యాపారాన్ని రెట్టింపు చేయనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఏడాది కాలంలో 1,840 కొత్త స్టోర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story