Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ ఇక లేనట్టే.. లిక్విడేషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

by S Gopi |   ( Updated:2024-11-07 13:13:49.0  )
Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ ఇక లేనట్టే.. లిక్విడేషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ చరిత్రలో భాగం కానుంది. ఆర్థిక సవాళ్లతో ఇప్పటికే కార్యకలాపాలను నిలిపేసిన సంస్థ ఆస్తులను నగదుగా మార్చి బ్యాంకులు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు పూర్తిగా చెల్లింపులు చేయకుండానే రిజల్యూషన్ ప్రక్రియను సమర్థించడం, యాజమాన్య హక్కులను జలాన్-కల్‌రాక్ కన్సార్టియంకు బదిలీ చేయాలని ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పక్కనపెట్టాలని, ఇందుకు ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలు ఇస్తున్నట్టు గురువారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంస్థ లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియలో వైఫల్యం వల్ల అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఆస్తులను విక్రయించేందుకు లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌కు తెలియజేసింది. ఈ నిర్ణయంతో జెట్ ఎయిర్‌వేస్ కాలగర్భంలో కలిసిపోనుంది.

2019లో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ కార్యకలాపాలను ఆపేసింది. బిడ్డింగ్ ద్వారా జలాన్-కర్‌లాక్ కన్సార్షియం జెట్ ఎయిర్‌వేస్‌కు దక్కించుకోగా, అనంతరం కన్సార్షియం, బ్యాంకులకు మధ్య వివాదం నెలకొంది. దీనికి సంబంధిచి ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకులు ఎన్‌సీఎల్ఏటీకి వెళ్లింది. యాజమాన్య హక్కుల బదిలీలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ఎన్‌సీఎల్ఏటీ కూడా సమర్థించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తాజా తీర్పు వెలువడింది. జలాన్ కన్సార్షియం నిధులు పెట్టడం, ఉద్యోగులకు జీతాలివ్వడంలో విఫలమవడంతో ఆస్తులను నగదుగా మార్చాలని నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed