స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు

by S Gopi |
స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత షేర్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినప్పటికీ సానుకూల సంకేతాల అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, దేశీయంగా కీలక రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ సహా పలు కంపెనీల షేర్లలో ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉంది. సాధారణంగానే ఎన్నికలకు సమీపంలో మార్కెట్ల ర్యాలీ సహజం. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు సానుకూలంగా ఉన్నారు. అలాగే, ఆటో, ఎనర్జీ, రియల్టీ రంగాల్లో భారీగా కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడిదారులు మన ఈక్విటీల్లో సుమారు రూ. 1700 కోట్ల విలువైన షేర్లను కొనడం వంటి పరిణామాలు మార్కెట్లు పుంజుకునేందుకు దోహదపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 494.28 పాయింట్లు ఎగసి 74,742 వద్ద, నిఫ్టీ 152.60 పాయింట్లు లాభపడి 22,666 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, మెటల్, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్‌టీ, రిలయన్స్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. నెస్లె ఇండియా, విప్రో, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.31 వద్ద ఉంది.

కొత్త రికార్డులు..

సోమవారం ట్రేడింగ్‌లో భారత ఈక్విటీ మార్కెట్లు ఎన్నికల ముందు ర్యాలీ చేసిన నేపథ్యంలొ కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకింది. 74,869 పాయింట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్ఠాలను తాకిన తర్వాత కొంత నెమ్మదించి 74,742 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో మదుపర్ల సంపద రూ. 2.52 లక్షల కోట్లు పెరగడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్లు ముగిసే సమయానికి రూ. 401.84 లక్షల కోట్ల వద్ద ఉంది. నిఫ్టీ సైతం 22,700 ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి తాకింది.

Advertisement

Next Story