వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

by Harish |   ( Updated:2023-10-20 11:15:34.0  )
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో నమోదైన గరిష్ట స్థాయి(7.44 శాతం) నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ ధోరణి సజావుగా కొనసాగేందుకు మానిటరీ పాలసీ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం జరిగిన కౌటిల్య ఎకనమిక్ కాన్‌క్లేవ్-2023 కార్యక్రమంలో పాల్గొన్న దాస్, ధరలు, ఆర్థిక స్థిరత్వాలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగానే అది ఉంటుందని చెప్పారు.

ఇటీవల కూరగాయలు, ఇంధన ధరలు దిగిరావడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టం 5.02 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతానికి కీలక పాలసీ రేట్ల విషయంలో విరామం కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు పెంచిన 250 బేసిస్ పాయింట్లతో ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని దాస్ వివరించారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ ఎంపీసీ కమిటీ నిర్ణయాలతో వడ్డీ రేట్లు గరిష్ఠానికి చేరాయి. ఇవి ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై చెప్పలేమని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచాయి. దీనికి భౌగోళిక రాజకీయ పరిణామాలు తోడయ్యాయి. అందుకనుగుణంగానే ఆర్‌బీఐ 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ, ఎంతకాలం స్థిరంగా ఉంటుందనేది చెప్పలేం, కాలమే దానికి జవాబు’ అని దాస్ వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నెమ్మదించిన వృద్ధి, ఆర్థిక అస్థిరత్వ లాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడి చమురు ధరలు, బాండ్ల రాబడి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఆర్థిక రంగానికి సంబంధించి, ఒత్తిడి పరిస్థితుల్లో కూడా భారతీయ బ్యాంకులు కనీస మూలధన అవసరాలను నిర్వహించగలవని ఆయన అన్నారు.

భారత్ ప్రపంచ వృద్ధికి కొత్త ఇంజన్‌గా మారేందుకు సిద్ధంగా ఉంది, మార్చి 2024తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం 6.5 శాతం జిడిపి వృద్ధి రేటును అంచనా వేస్తుందని దాస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story