భారీగా పెరిగిన రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల అమ్మకాలు

by S Gopi |
భారీగా పెరిగిన రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లలో ఇళ్లను కొనాలనుకునే వారి ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉండటానికి మాత్రమే ఇల్లు అని కాకుండా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఆశించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ, గడిచిన ఏడాది కాలంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 75 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ స్థిరాసి సేవల సంస్థ సీబీఆర్ఈ తాజా డేటా ప్రకారం, హై నెట్-వర్త్ కలిగిన వ్యక్తులు(హెచ్ఎన్ఐ) విలాసవంతమైన నివాసాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్లు 2022లో 7,395 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023లో ఈ విభాగంలో ఏకంగా 12,935 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వీటి అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. దీంతో సహా దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 'మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ప్రీమియం, లగ్జరీ విభాగంలో ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. స్థిరాస్తి మార్కెట్లో పరిస్థితులు, రుణ సదుపాయాలు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తుల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు ఇదే తరహాలో వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని' సీబీఆర్ఈ ఇండియా ఛైర్మన్ అన్షుమన్ మేగజైన్ పేర్కొన్నారు. సీబీఆర్ఈ నివేదిక ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,860 నుంచి 2023లో 5,530 యూనిట్లు విక్రయించబడ్డాయి. ముంబైలో 3,390 నుంచి గతేడాది 4,190 యూనిట్లు, హైదరాబాద్‌లో 1,240 యూనిట్ల నుంచి 2,030 యూనిట్లకు, పూణెలో 190 యూనిట్ల నుంచి 450 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో గతేడాది మొత్తం 265 లగ్జరీ ఇళ్లు, కోల్‌కతాలో 310 యూనిట్లు, చెన్నైలో 160 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Advertisement

Next Story