హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగుళూరులో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు

by Harish |
హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగుళూరులో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, పెట్టుబడులకు మంచి అవకాశాలు ఏర్పడటం వలన హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగుళూరులో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని టీమ్‌లీజ్ నివేదిక తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 56 శాతం మంది కంపెనీల యజమానులు రాబోయే నెలల్లో తమ ఉద్యోగులను విస్తరించాలని యోచిస్తున్నట్లు నివేదిక తెలిపింది. హెల్త్‌కేర్, ఫార్మా, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని యజమానులు కొత్త నియామకాలు చేయడానికి ప్రణాళికలను కలిగి ఉన్నారని, నిర్మాణం, రియల్ ఎస్టేట్, ప్రయాణం, ఆతిథ్యం,​ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలలో వృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నట్లు టీమ్‌లీజ్ పేర్కొంది.

హైదరాబాద్‌లో 47.57 శాతం, ఢిల్లీలో 53.21శాతం, బెంగుళూరులో 50.46 శాతం ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి చెందుతున్నాయని, కంపెనీల యజమానులు ఈ ప్రాంతాల నుంచి తమ వర్క్ ఫోర్స్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నట్లు నివేదిక హైలైట్ చేసింది. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు, స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు, మధ్య తరహా కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యం, సంస్థాగత సామర్థ్యాలను కలిగి ఉన్నవారిని నియమించుకోవడానికి యజమానులు ఆసక్తిగా ఉన్నారు.

ముఖ్యంగా ఉద్యోగుల ఎంపికలో AI నైపుణ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఉత్పాదకలో దీని వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సర్వే చేసిన సంస్థలలో 35 శాతం AI సాంకేతికత కలిగిన వారిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని తేలింది. ఇదిలా ఉంటే, భారతదేశం 2024లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న G-20 ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని, బలమైన పెట్టుబడి డిమాండ్, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంతోపాటు, జాబ్ మార్కెట్ ప్రపంచ ఎదురుగాలులను ఎదుర్కొంటూ నిలకడగా ఉందని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. 20 నగరాల్లోని 1,417 మంది యజమానులను సర్వే చేసి టీమ్‌లీజ్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed