దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం!

by Harish |
దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం!
X

న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ప్రస్తుత ఏడాది జనవరి నెలకు సంబంధించి టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 4.73 శాతంగా నమోదైంది. ఇది గత రెండేళ్లలోనే కనిష్టం. అంతకుముందు డిసెంబర్ నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.95 శాతంగా ఉంది. నవంబర్‌లో 6.12 శాతం ఉంది. సమీక్షించిన నెలలో ప్రధానంగా కెమికల్స్, దాని సంబంధిత ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్‌టైల్స్, ముడి చమురు, సహజ వాయువు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లనే టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తన ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత నెలలో ఆహార పదార్థాల ధరలు 2.38 శాతానికి పెరిగింది. పప్పు ధాన్యాల ధరలు 2.41 శాతం పెరిగాయి. కూరగాయల టోకు ద్రవ్యోల్బణం 26.48 శాతంగా ఉంది. నూనె గింజల ద్రవ్యోల్బణం జనవరిలో 4.22 శాతం క్షీణించాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 2022, డిసెంబర్‌లో 18.09 శాతం నుంచి 15.15 శాతానికి తగ్గింది.

తయారీ ఉత్పత్తుల ధరలు 2.99 శాతానికి తగ్గుముఖం పట్టింది. కాగా, సోమవారం(ఫిబ్రవరి 13) విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎగువన 6.52 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఓ వైపు రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం, మరోవైపు టోకు ద్రవ్యోల్బణం తగ్గడం గమనార్హం.

Advertisement

Next Story