Job Market: 2025లో 9 శాతం వృద్ధి చెందనున్న జాబ్ మార్కెట్

by S Gopi |
Job Market: 2025లో 9 శాతం వృద్ధి చెందనున్న జాబ్ మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు వ్యాపార అవసరాల దృష్ట్యా 2025లో భారత జాబ్ మార్కెట్ మెరుగైన వృద్ధిని సాధిస్తుందని ఓ నివేదిక తెలిపింది. ప్రధానంగా ఐటీ, రిటైల్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాల మద్దతుతో ఇది 9 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. ప్రముఖ జాబ్స్, టీలెంట్ పాట్‌ఫామ్ ఫౌండ్ఇట్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. ఈ ఏడాది నవంబర్‌లో నియామకాలు 10 శాతం పెరిగాయని, ఈ ధోరణి కొత్త ఏడాదిలోనూ కొనసాగనుంది. ప్రధానంగా ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటం అప్లికేషన్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆవిష్కరణలతో తయారీ, హెల్త్‌కేర్, ఐటీ పరిశ్రమల్లో కొత్త మార్పులు జరుగుతున్నాయి. మరోవైపు రిటైల్, మీడియా రంగాల్లో ఏఐ ఆధారిత వర్క్‌ఫోర్స్ పెరుగుతుండటం, కీలక డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్‌మెంట్, హెచ్ఆర్ అనలిటిక్స్ వంటి స్కిల్స్ ఉన్నవారికి భారీగానే డిమాండ్ ఉందని ఫౌండ్ఇట్ తన నివేదిక వివరించింది. చాలా కంపెనీలు అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసమే కాకుండా కొత్త టాలెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తు తరాలకు అనుగుణంగా వ్యాపారాల నిర్వహణ సులభంగా ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయని ఫౌండ్ఇట్ మార్కెటింగ్ వైస్-ప్రెసిడెంట్ అనుపమ భీమ్‌రాజ్కా చెప్పారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీలు) విస్తరణ, మల్టీ-క్లౌడ్ అడాప్షన్‌తో 2025లో ఐటీ రంగంలో 15 శాతం నియామకాల వృద్ధి ఉండనుంది. దీని తర్వాత రిటైల్ రంగం 12 శాతం నియామక వృద్ధిని సాధించగలదని నివేదిక అంచనా వేసింది. ఇక, టైర్-2, టైర్-3 నగరాల్లో పెరుగుతున్న వినియోగదారుల వ్యయం కారణంగా ఓ మోస్తరు గ్రాసరీ మార్ట్‌ల వృద్ధి వేగంగా జరుగుతోంది. దీనివల్ల ఈ రంగంలో నియామకాలు ఎక్కువగా జరగనున్నాయని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story