సెప్టెంబర్ జీఎస్టీ ఆదాయం రూ. 1.63 లక్షల కోట్లు!

by Vinod kumar |
సెప్టెంబర్ జీఎస్టీ ఆదాయం రూ. 1.63 లక్షల కోట్లు!
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, కొత్త వ్యాపారాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడ్డాయి. తాజాగా, సెప్టెంబర్ నెలకు అంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ. 1.63 లక్షల కోట్లకు పెరిగాయని, ఇది ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది.

అంతకుముందు ఆగష్టులో జీఎస్టీ ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ విధానం అమలైన తర్వాత ఆరవసారి జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ మార్కు దాటడం నాలుగోసారి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గత నెలలో మొత్తం రూ. 1,62,712 కోట్లు ఆదాయం వచ్చింది.

అందులో సీజీఎస్టీ రూ. 29,818 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 37,657 కోట్లు, ఐజీఎస్టీ రూ. 83,623 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 41,145 కోట్లతో కలిపి), సెస్ రూ. 11,613 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 881 కోట్లతో కలిపి) వచ్చాయి. వస్తు, సేవల పన్ను ఆదాయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించాయి. తెలంగాణలో గత నెల జీఎస్టీ వసూళ్లు రూ. 5,226 కోట్లతో 33 శాతం పెరిగాయి. గతేడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ. 3,915 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల రూ. 3,658 కోట్లు రాగా, ఇది గతేడాది మేలో వచ్చిన రూ. 3,132 కోట్ల కంటే 17 శాతం ఎక్కువని మంత్రిత్వ శాఖ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed