రికార్డు స్థాయికి చేరిన స్మార్ట్ ఫోన్ ఎగుమతులు

by Harish |
రికార్డు స్థాయికి చేరిన స్మార్ట్ ఫోన్ ఎగుమతులు
X

బెంగళూరు: భారత్, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 85,000 కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసినట్లు పరిశ్రమ గణాంకాలు శనివారం వెల్లడించాయి. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) నివేదిక ప్రకారం, స్థానికంగా తయారీకి లభిస్తున్న ప్రోత్సాహం, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో $10 బిలియన్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను అధిగమించినట్లు ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారతదేశం నుండి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.

ప్రధానంగా భారత్ నుంచి మొబైల్ ఫోన్‌లు ఎగుమతి అవుతున్న దేశాల్లో UAE, US, నెదర్లాండ్స్, UK, ఇటలీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో 97 శాతానికి పైగా స్థానికంగా ఉత్పత్తి అవుతున్నవే ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది దేశీయ మొబైల్ ఫోన్ ఎగుమతులు రూ. 1 లక్ష కోట్లు దాటుతుందని 2023 సంవత్సరం ఒక మైలురాయిగా ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

Advertisement

Next Story