Cabinet Meeting: ఫేమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ 'పీఎం ఈ-డ్రైవ్' స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

by S Gopi |
Cabinet Meeting: ఫేమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో పంచుకున్నారు. వాటిలో గత తొమ్మిదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ ఫేమ్‌కు సంబంధించినది. ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన ఈ పథకం స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం, విక్రయాలను పెంచేందుకు రెండేళ్లకు రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకం ద్వారా 24.79 లక్షల ఈవీ టూవీలర్లు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,029 ఈ-బస్సులు ప్రయోజనాలు పొందనున్నాయి. వీటికోసం అవసరమైన 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు తోడ్పాటునందించనుంది. అలాగే, ఈ పథకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర ఈవీల ప్రోత్సహించడానికి రూ. 3,679 కోట్ల విలువైన సబ్సిడీ ప్రోత్సాహకాలను అందిస్తుంది.

దీంతో పాటు దేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అందితూ కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ఇక, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) పథకానికి సంబంధించి నాలుగో దశను ఆమోదించింది. దీని ద్వారా ప్రధానంగా గ్రామీణ రహదారుల కోసం రూ. 70,125 కోట్లను ఖర్చు చేయనుంది. మొత్తం 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించనున్నారు. దీనివల్ల 25 వేల వరకు అనుసంధానం లేని ఆవాసాలకు కనెక్టివిటీ, కొత్త వంతెనలను నిర్మించడం, మరమ్మత్తులు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ఐదేళ్లకు కేంద్ర వాటా రూ. 49,087.50 కోట్లు, రాష్ట్రాల వాటా రూ. 21,037.50 కోట్లుగా ఉంటాయి.

Advertisement

Next Story