ఈ ఏడాదిలో 20 శాతం పెరగనున్న పాత బంగారం అమ్మకాలు!

by Harish |   ( Updated:2023-06-13 13:21:18.0  )
ఈ ఏడాదిలో 20 శాతం పెరగనున్న పాత బంగారం అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయులు రికార్డు స్థాయిలో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తారని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) మంగళవారం ప్రకటనలో తెలిపింది. దేశీయంగా పసిడి ధరలు గరిష్ఠాల వద్ద కొనసాగుతుండటమే దీనికి కారణమని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. దేశీయంగా ధరలు పెరుగుతూ ఉంటే, రీసైకిల్ బంగారం అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 2019 నాటి 119.5 టన్నుల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని డబ్ల్యూజీసీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీ ఆర్ సోమసుందరం చెప్పారు.

ఇదే సమయంలో ఈ ఏడాది దేశంలో బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన 12 నెలల్లో భారత్‌లో పసిడి ధరలు దాదాపు ఐదవ వంతు పెరిగాయి. ప్రపంచ ధరల పెరుగుదల కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. దేశ కరెన్సీ రూపాయి బలహీనపడటం వల్ల కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రీసైకిల్ బంగారం అమ్మకాలు పావు వంతు పెరిగి 35 టన్నులకు చేరిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ ఆశిష్ పేథే చెప్పారు. గతేడాది కంటే ఈసారి పాత బంగారం విక్రయాలు 35-40 శాతం వరకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed