వచ్చే ఏడేళ్లలో జనరేటివ్ ఏఐతో జీడీపీకి రూ. 125 లక్షల కోట్ల సహకారం

by S Gopi |
వచ్చే ఏడేళ్లలో జనరేటివ్ ఏఐతో జీడీపీకి రూ. 125 లక్షల కోట్ల సహకారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త టెక్నాలజీ జనరేటివ్ ఏఐ భారత్‌కు కొత్త ఉత్పాదకతను, అవకాశాలను అందించనుందని ఈవై నివేదిక అభిప్రాయపడింది. ఒక అంచనా ప్రకారం, రాబోయే ఏడేళ్ల కాలంలో జెనరేటివ్ ఏఐ దేశ జీడీపీకి సుమారు రూ. 99-125 లక్షల కోట్ల వరకు సహకారం అందించనుంది. ఇందులో విద్య, నైపుణ్యం కీలకంగా వ్యవహరించనున్నాయని ఈవై నివేదిక తెలిపింది. డిజిటల్ ప్రపంచంలో ప్రతిభ ఎక్కడి నుంచైనా పెరిగే వీలుందని, డిజిటల్ స్కిల్స్ అనేది దేశ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌లా మారనుందని, లక్షలాది మంది దీన్ని ఉపయోగించుకుంటారని నివేదిక వెల్లడించింది. బీసీజీ నిర్వహించిన ఓ సర్వేలో 89 శాతం మంది కంపెనీల సీఈఓలు జనరేటివ్ ఏఐ మొదటి మూడు ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉందని తేలింది. అయితే, ప్రస్తుతం జనరేటివ్ ఏఐలో ప్రతిభ, స్కిల్స్ కొరత వంటి సవాళ్లు ఉన్నాయి. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐలో స్కిల్స్ కలిగిన వారికి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. కంపెనీలు ఏఐ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉద్యోగులకు నిర్మాణాత్మక మార్గాలను కల్పించాలని నివేదిక సూచించింది. ఇప్పటికే దేశీయంగా ఎల్అండ్‌టీ లాంటి కంపెనీలు జెన్ఏఐ అకాడమీని ప్రారంభించి డిజిటల్ అక్షరాస్యతను పెంచడంతో ముందడుగు వేశాయి. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచానికి అవసరమైన శ్రామికశక్తి అందించడంలో భారత్ కీలకంగా ఉండనుంది. ఇది ముఖ్యంగా ఏఐ స్కిల్స్ ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు కల్పించే వీలుంటుందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story