హ్యాండ్ టూల్స్ పరిశ్రమకు పీఎల్ఐ పథకం అందించాలని కోరిన అసోసియేషన్!

by srinivas |
హ్యాండ్ టూల్స్ పరిశ్రమకు పీఎల్ఐ పథకం అందించాలని కోరిన అసోసియేషన్!
X

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని పెంచడంతో పాటు ఎగుమతులు, ఉద్యోగాల కల్పన కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అందించాలని ఇంజనీరింగ్ రంగంలోని ఎంఎస్ఎంఈ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. దేశీయ హ్యాండ్ టూల్స్ పరిశ్రమ ఏడాదికి రూ. 3,200 కోట్ల ఎగుమతులను నమోదు చేస్తోంది. ఈ రంగంలో పతి ఏటా రూ. కోటి విక్రయాలకు ఏడుగురు ఉపాధి పొందుతున్నారని, ఇది సైకిల్ పరిశ్రమలో నలుగురు, టెక్స్‌టైల్స్ పరిశ్రమలో 5-6 మందికి కల్పిస్తున్న ఉపాధి కంటే ఎక్కువగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖకు హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ పంపిన లేఖలో పేర్కొంది.

భారతీయ చేతి పరికరాల పరిశ్రమ పూర్తిస్థాయిలో సామర్థ్యం అందుకునేందుకు మద్దతు కావాలని, పరిశ్రమలో భారీ అవకాశాలున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సి రల్‌హాన్ చెప్పారు. అయితే, ప్రస్తుతం వేగవంతంగా పెరుగుతున్న ఆధునీకరణ పరిశ్రమకు అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం చేతిపరికారల పరిశ్రమ విలువ రూ. 30,000 కోట్లుగా ఉంది. ఇది భారత పరిశ్రమకలు అనేక అవకాశాలను అందించగలదని, ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి, పీఎల్ఐ పథకం కిందకు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నట్టు రల్హాన్ తెలిపారు.

ఉదాహరణకు హ్యాండ్ టూల్స్ పరిశ్రమలోని సాకెట్ తయారీ విలువ ప్రపంచవ్యాప్తంగా రూ. 20 వేల కోట్లుగా ఉంటే, ఇందులో భారత్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభిస్తే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమని, ఇదిమాత్రమే కాకుండా స్పానర్లు, రెంచ్‌లు, ఇంకా అనేక వస్తువుల తయారీ, ఎగుమతులు పెంచేందుకు అపారమైన సామర్థ్యం తమకుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story