పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం

by S Gopi |
పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భూమిపైన వాతావారణం దెబ్బతింటోందని, దాన్ని కాపాడేందుకని భారత్‌తో పాటు అంతర్జాతీయంగా అనేక ప్రధాన దేశాలు పర్యావరణ అనుకూల రవాణాపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. వాహనాల కాలుష్యం తగ్గించేందుకు ఈవీలను ప్రత్యామ్నాయంగా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈవీలు చాలావరకు సాధారణ జీవితంలో భాగంగా మారిపోయాయి. అయితే, తాజా ఓ పరిశోధనా సంస్థ సంచనల అధ్యయనం విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీలే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని ప్రముఖ ఎమిషన్ అనలిటిక్స్ సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. రెండు రకాల వాహనాల్లోని బ్రేకింగ్, టైర్ల నుంచి విడుదలవుతున్న కాలుష్యంపై సంస్థ అధ్యయనం చేసింది.

సాంప్రదాయ ఇంధన కార్ల ఇంజిన్ కంటే ఈవీల్లో బ్యాటరీల బరువు అధికంగా ఉంటుంది. దీనివల్ల బ్రేక్ వేసిన సమయంలో టైర్లపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడి హానికారక రసాయనాలు విడుదల అవుతున్నట్టు సంస్థ తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ కార్లలో విడుదలయ్యే దాని కంటే 1850 రెట్లు అధికమని పేర్కొంది. టైర్ల తయారీలో సింథటిక్ రబ్బర్, ముడి చమురును వినియోగిస్తారు. దీనివల్లే ఈ హానికారక రసాయనాలు వెలువడుతున్నట్టు ఎమిషన్ అనలిటిక్స్ వివరించింది. ప్రస్తుతం చాలా దేశాలు ఈవీలకు మారుతున్నాయి. భవిష్యత్తులో వీటి వినియోగం పెరిగితే, ఈవీ తయారీ కంపెనీలు బ్రేకింగ్ సిస్టమ్, టైర్ల నుంచి విడుదల అవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సంస్థ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed