Air India: ఎయిర్ ఇండియాకు వరుసగా షాక్‌లు ఇస్తున్న డీజీసీఏ.. ఈసారి..

by Harish |   ( Updated:2024-08-23 10:32:28.0  )
Air India: ఎయిర్ ఇండియాకు వరుసగా షాక్‌లు ఇస్తున్న డీజీసీఏ.. ఈసారి..
X

దిశ, బిజినెస్ బ్యూరో: అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది. అదనంగా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్‌ డైరెక్టర్‌కు రూ.3 లక్షలు.. మొత్తం కలిపి రూ. 99 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జులై 9న ముంబయి నుంచి రియాద్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్‌ వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ట్రైనింగ్‌ కెప్టెన్‌ విధుల్లోకి రాకపోవడంతో సాధారణ కెప్టెన్‌‌ను పంపించారు.

అయితే ఈ కెప్టెన్‌కు ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇచ్చే అర్హత లేదు. తర్వాత జులై 10న ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా స్వచ్చందంగా డీజీసీఏకు నివేదిక రూపంలో సమర్పించింది. దీంతో రెగ్యులేటర్ ఎయిర్‌లైన్‌పై దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎయిర్ ఇండియా, సిబ్బంది నియంత్రణ నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించింది. డీజీసీఏ జులై 22న ఈ సంఘటనలో పాల్గొన్న ఫ్లైట్ కమాండర్, ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై వారి నుంచి వచ్చిన సమాధానంతో సంతృప్తి అది చెందలేదు.

ఇలాంటి చర్యలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని, భద్రతా లోపంగా పరిగణించి ఎయిర్‌లైన్‌‌కు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని పైలట్లను హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియాకు గతంలో చాలా సార్లు జరిమానాలు విధించారు. తాజాగా పడినటువంటి జరిమానా గత 18 నెలల్లో పన్నెండవది కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో కూడా ఎయిర్‌లైన్‌కు రూ.80లక్షల జరిమానా విధించారు. వరుస జరిమానాలతో ఎయిర్ ఇండియాకు షాక్‌లు తగులుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed