లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. గతవారాంతం అధిక లాభాలతో ముగిసిన సెషన్‌లు సోమవారం ట్రేడింగ్ సైతం అదే స్థాయిలో ప్రారంభించాయి. ఉదయం మోస్తరు లాభాల్తో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత పుంజుకుంది. ప్రధానంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించడం,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన మద్దతు కారణంగా పెరిగాయి. అయితే, దేశ టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరడంతో పాటు జూన్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండటంతో సూచీలు మిడ్-సెషన్ తర్వాత స్థిరంగా ర్యాలీ చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 145.52 పాయింట్లు లాభపడి 80,664 వద్ద, నిఫ్టీ 84.55 పాయింట్లు పెరిగి 24,586 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం షేర్లు ఏకంగా 3 శాతం పుంజుకోగా, మీడియా, ఫార్మా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.59 వద్ద ఉంది. మార్కెట్ల సానుకూల ర్యాలీతో సోమవారం మదుపర్ల సంపద రూ.2.7 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.455.08 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed