స్వల్పంగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
స్వల్పంగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా దిగొచ్చింది. అంతకుముందు జనవరిలో 5.10 శాతంగా నమోదైన సీపీఐ ద్రవ్యోల్బణం గత నెలలో 5.09 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికీ ఆహార ధరలు ఎక్కువగా ఉండటం వల్లనే సీపీఐ ద్రవ్యోల్బణం దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్దేశించిన లక్ష్యం పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.30 శాతం నుంచి 8.66 శాతానికి చేరింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.34 శాతం వద్దే ఉండగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.92 శాతం నుంచి 4.78 శాతానికి తగ్గింది. ఇక, కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 27.03 శాతం నుంచి 30.25 శాతానికి చేరగా, ఇంధన ద్రవ్యోల్బణం 0.77 శాతానికి, విద్యుత్ ద్రవ్యోల్బణం 0.60 శాతం క్షీణతను నమోదు చేశాయి.

మరోవైపు, భారత పారిశ్రామికోత్పత్తి గణాంకాలను సైతం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. జనవరి నెలకు సంబంధించి ఐఐపీ సూచీ 3.8 శాతం పెరిగింది. తయారీ రంగం ఉత్పత్తి జనవరిలో 3.2 శాతం, మైనింగ్ ఉత్పత్తి 5.9 శాతం, విద్యుత్ ఉత్పత్తి 5.6 శాతం పెరిగింది.

Advertisement

Next Story