50 ఏళ్ల నాటి 'కాంపా' డ్రింక్‌ను తిరిగి మార్కెట్లో విడుదల చేసిన రిలయన్స్!

by Harish |
50 ఏళ్ల నాటి కాంపా డ్రింక్‌ను తిరిగి మార్కెట్లో విడుదల చేసిన రిలయన్స్!
X

ముంబై: యాభై ఏళ్ల నాటి సాఫ్ట్‌డ్రింక్ బ్రాండ్ కాంపాను రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్(ఆర్‌సీపీఎల్) తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు గురువారం ప్రకటించింది. గతేడాది ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి ఆర్‌సీపీఎల్ రూ. 22 కోట్లకు కాంపా బ్రాండ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా విడుదల చేసిన బ్రాండ్‌లో కాంపా లెమన్, కాంపా ఆరెంజ్, కాంపా కోలా ఫ్లేవర్లను తీసుకొచ్చామని, వేసవి సీజన్ కారణంగా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్‌ను రీలాంచ్ చేశామని కంపెనీ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో చేరువైన బ్రాండ్‌ను తిరిగి తీసుకురావడం సంతోషంగా ఉంది. దేశీయ వినియోగదారులతో ఏళ్లుగా అనుబంధం ఉన్న కాంపా మళ్లీ అందరికీ చేరువ కానుందని కంపెనీ అభిప్రాయపడింది. మార్కెట్లోకి విడుదలైన కాంపా డ్రింక్స్ 200ఎంఎల్, 500ఎంఎల్, 600ఎంఎల్, 1 లీటర్, 2 లీటర్ల ప్యాకేజీలలో లభిస్తాయి. 200ఎంఎల్ ధర రూ. 10 ఉండగా, 500ఎంఎల్ ధరను రూ. 20గా ఉంది.

ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వీటి అమ్మకాలను ప్రారంభిస్తున్నామని రిలయన్స్ పేర్కొంది. కాగా, భారత సాఫ్ట్‌డ్రింక్ మార్కెట్లో 1980ల కాలంలో కాంపా బ్రాండ్ అత్యంత ఆదరణను సంపాదించుకుంది. 1990ల్లో విదేశీ బ్రాండ్‌లైన కోకాకోలా, పెప్సీల రాకతో కాంపా నెమ్మదిగా కనుమరుగైంది.

Advertisement

Next Story

Most Viewed