ఆగస్టులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభం

by S Gopi |
ఆగస్టులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆత్మనిర్భర్ విధానానికి అనుగుణంగా ఈ ఆగష్టులో దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి ఈ సేవలు అందించనున్నట్టు తెలిపాయి. 700 మెగాహెర్ట్జ్ ప్రీమియం స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పాటు పైలట్ దశలో 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూపొందించిన 4జీ నెట్‌వర్క్ ద్వారా సెకనుకు 40-45 ఎంబీ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ టెలికాం రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేతృత్వంలోని కన్సార్టియం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ పరిజ్ఞానం ద్వారా 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సీ-డాట్ అభివృద్ధి చేసిన 4జీ పైలట్ ప్రాజెక్ట్ పంజాబ్‌లోని బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చాలా బాగా పనిచేస్తోంది. ఆగష్టు నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. దేశమంతటా 4జీ,5జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ 1.12 లక్షల టవర్లను విస్తరించే ప్రక్రియలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జీ సేవల కోసం 9,000 టవర్లను ఇన్‌స్టాల్ చేసింది. గత 4-5 ఏళ్లుగా బీఎస్ఎన్ఎల్ 4జీ సామర్థ్యం ఉన్న సిమ్‌లను మాత్రమే విక్రయిస్తోంది. పాత సిమ్‌లను కలిగి ఉన్న వినియోగదారులు మాత్రమే కొత్త సిమ్‌ను తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story