మరింత భారం కానున్న ఏటీఎం లావాదేవీలు

by S Gopi |
మరింత భారం కానున్న ఏటీఎం లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. వినియోగదారులు నగదు లావాదేవీలపై త్వరలో అధిక చెల్లింపులు చేయాల్సి రావొచ్చు. దీనికి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) సెంట్రల్ బ్యాంకుతో పాటు ఎన్‌పీసీఐని సంప్రదించింది. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటిని మించి చేసే నగదు, నగదురహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు అవకాశమివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)లను సీఏటీఎంఐ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులు పెరిగిన నేపథ్యంలోనే సాధారణ ఖర్చులకు గానూ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతివ్వాలని కోరినట్టు సమాచారం. ప్రతి లావాదేవీకి ఏటీఎం విత్‌డ్రా రుసుమును గరిష్ఠంగా రూ. 23కు పెంచాలని సీఏటీఎంఐ భావిస్తోంది. ఇదివరకు 2021లో ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ. 15 నుంచి రూ. 17కి పెంచారు. ఈ ఛార్జీలు గరిష్ఠ పరిమితిని రూ. 21గా నిర్ణయించారు. ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్స్ ఖాతా వినియోగదారులకు మెట్రో నగరాల్లో ప్రతి నెలా కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు లావాదేవీలు ఉచితంగా ఉన్నాయి. ఒక కస్టమర్ ఉచిత లావాదేవాల నెలవారీ పరిమితి దాటితే బ్యాంకులు రుసుమును వసూలు చేస్తాయి. ఇప్పటివరకు పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి బ్యాంకు అదనంగా రూ. 21 ఛార్జీని వసూలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed