- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Indian Companies: భారత టాప్-500 కంపెనీల విలువ రూ. 330 లక్షల కోట్లు

దిశ, బిజినెస్ బ్యూరో: 2024లో దేశంలోని మొదటి 500 కంపెనీల విలువ రూ. 330 లక్షల కోట్లకు(3.8 ట్రిలియన్ డాలర్ల) చేరుకుంది. ఇది 2023లో భారత జీడీపీ కంటే ఎక్కువ. మంగళవారం యాక్సిస్ బ్యాంక్ ఇండియా ప్రైవేట్, బుర్గుండి విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా-500 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ కంపెనీల విలువ అంతకుముందు ఏడాది కంటే 40 శాతం పెరిగింది. అంతేకాకుండా వాటి విలువ భారత్‌తో పాటు యూఏఈ, ఇండోనేషియా, స్పెయిన్‌ల సంయుక్త జీడీపీల కంటే అధికం కావడం గమనార్హం. గతేడాది బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా-500లో స్థానం కోసం కంపెనీల సగటు విలువ రూ. 9,580 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఉన్న సగటు రూ. 6,700 కోట్ల కంటే 43 శాతం పెరిగింది. అలాగే ఈ జాబితా ప్రారంభమైన నాటి నుంచి తొలిసారి టాప్-500లోని అన్ని కంపెనీల విలువ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించినప్పటికీ కంపెనీల విలువ పెరగడం విశేషం.
టాప్-10 ఇవే..
టాప్-500 జాబితాలోని కంపెనీలు దేశ ప్రైవేట్ రంగానికి వెన్నెముకగా, గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ కంపెనీలు 84 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రెహమాన్ జునైద్ చెప్పారు. ఈ జాబితాలో రూ. 17.5 లక్షల కోట్ల(12 శాతం వృద్ధి)తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 30 శాతం వృద్ధితో రూ. 16.1 లక్షల కోట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 14.2 లక్షల కోట్లు(26 శాతం), భారతీ ఎయిర్‌టెల్ రూ. 9.74 లక్షల కోట్లు(75 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 9.30 లక్షల కోట్లు(44 శాతం), ఇన్ఫోసిస్ రూ. 7.99 లక్షల కోట్లు(40 శాతం), ఐటీసీ రూ. 5.80 లక్షల కోట్లు(8 శాతం), ఎల్అండ్‌టీ రూ. 5.42 లక్షల కోట్లు(35 శాతం), హెచ్‌సీఎల్ టెక్ రూ. 5.18 లక్షల కోట్లు(51 శాతం), ఎన్ఎస్ఈ రూ. 4.70 లక్షల కోట్లు(202 శాతం) విలువతో మొదటి పది స్థానాల్లో నిలిచాయి.
అత్యధికంగా లాభపడిన కంపెనీల్లో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2024లో 297 శాతం వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత ఐనాక్స్ విండ్, జెప్టో కంపెనీలు మూడు రెట్లు పెరిగాయి. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకోలేదు.
మొదటిసారి లిస్ట్‌లోకి..
బుర్గుండి హురున్ ఇండియా జాబితాలో తొలిసారిగా భారతీ ఎయిర్‌టెల్ టాప్-5లో స్థానం దక్కించుకుంది. అలాగే, ఎన్ఎస్ఈ టాప్-10లోకి దూసుకొచ్చింది. ఈ కంపెనీ రూ. 4.7 లక్షల కోట్లతో అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ కంపెనీగా నిలిచింది.