భారత్‌లో AI సర్వర్‌లను తయారు చేయనున్న ఫాక్స్‌కాన్

by Harish |   ( Updated:2024-06-28 08:01:18.0  )
భారత్‌లో AI సర్వర్‌లను తయారు చేయనున్న ఫాక్స్‌కాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇండియాలో భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దేశంలో తన ప్లాంట్‌లను కలిగి ఉన్న సంస్థ, వ్యాపార విస్తరణలో భాగంగా కృత్రిమ మేధస్సు (AI) సర్వర్‌లను ఇండియాలో ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఈ సర్వర్ల ఉత్పత్తి కోసం కంపెనీ తమిళనాడులో ఇప్పటికే ఉన్న తయారీ సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్ ఇండియాలో యాపిల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తుంది.

అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, నివిడియా వంటి గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఈ విభాగంలో ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఫాక్స్‌కాన్ సొంతంగా కృత్రిమ మేధస్సు (AI) సర్వర్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. భారతదేశంలో AI సర్వర్‌లను తయారు చేయడం ఫాక్స్‌కాన్‌కు ఉన్న లక్ష్యమని పరిశ్రమ నిపుణులు తెలిపారు. AI సర్వర్‌ల కోసం ప్రపంచ మార్కెట్ వాటా మునుపటి సంవత్సరంలో 30 శాతం నుండి ఈ సంవత్సరం 40 శాతానికి పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తుంది. దానిలో భాగంగానే ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

మే నెలలో తైపీలో జరిగిన వార్షిక వాటాదారుల సమావేశాన్ని ఉద్దేశించి ఛైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ, AI సర్వర్లు త్వరలో ఫాక్స్‌కాన్‌కు తదుపరి-ట్రిలియన్ ఆదాయ ఉత్పత్తిని అందిస్తాయని అన్నారు. యాపిల్ ఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్న ఫాక్స్‌కాన్‌ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్, సర్వర్‌ల తయారీపై తదుపరి వృద్ధి సారించిందని విశ్లేషకులు తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్ కోసం భారతదేశం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం నుండి కూడా ఫాక్స్‌కాన్ ప్రయోజనం పొందుతుంది. తమిళనాడులో స్థానికంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి గూగుల్ కంపెనీతో అధునాతన చర్చలు జరుపుతున్నట్లు, దీంతో తన పెట్టుబడులను పెంచుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed