భారత్‌లో iPhone 14 తయారీపై Apple కీలక నిర్ణయం!

by Harish |   ( Updated:2022-08-23 11:07:47.0  )
భారత్‌లో iPhone 14 తయారీపై Apple కీలక నిర్ణయం!
X

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 14 తయారీని భారత్‌లో చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం ఇప్పటికే సరఫరాదారులతో చర్చిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. గత కొంతకాలంగా చైనా, అమెరికా మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీ విషయమై ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తున్నట్టు నివేదిక అభిప్రాయపడింది.

చైనాకు వెలుపల ఉత్పత్తిని పెంచడం ద్వారా సరఫరా సామర్థ్యంలో నెలకొనే సమస్యలను అధిగమించవచ్చని, ఇందులో భాగంగానే ఐఫోన్ 14ని భారత్‌లో తయారుచేసి రవాణా చేయాలని భావిస్తోంది. కొత్త ఐఫోన్ 14 అమ్మకాలు ఆసియా ప్రాంతంలో ముందుగా చైనాలో ప్రారంభం కానున్నాయి. అనంతరం 2,3 నెలల తర్వాతే భారత మార్కెట్లోకి రానున్నాయి.

కొవిడ్-19 మహమ్మారి, సెమీకండక్టర్ల కొరత వల్ల ఇదివరకు యాపిల్ ఉత్పత్తుల విడుదలకు ఆరు నెలలకు పైగా సమయం కూడా పట్టింది. ఈ క్రమంలోనే యాపిల్ తన ఐఫోన్ 14 విషయంలో ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక వివరించింది. అంతేకాకుండా ఉత్పత్తుల తయారీ విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, భారత్‌లో తయారీ ద్వారా ఇది సాధ్యమని కంపెనీ ఆశిస్తోంది.

యాపిల్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ ఈ అంశంపై కసరత్తు చేస్తోంది. ఐఫోన్ తయారీ కోసం అవసరమైన సదుపాయాలను చైనా నుంచి భారత్‌లోని చెన్నై ప్లాంట్‌కు తరలించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం సరైన సమయంలో పూర్తయితే ఈ ఏడాది దీపావళి నాటికి మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 14 మార్కెట్లోకి వస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించి యాపిల్ సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed