Amara Raja: అమర రాజా ఏకీకృత లాభం రూ.249 కోట్లు

by Harish |
Amara Raja: అమర రాజా ఏకీకృత లాభం రూ.249 కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాటరీల తయారీలో రెండు దశాబ్దాలకు పైగా కార్యకలాపాలు సాగిస్తున్న అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో పన్ను తర్వాత ఏకీకృత లాభం 25.6 శాతం పెరిగి రూ. 249.12 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.198.31 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఏకీకృత ఆదాయం 16.70 శాతం పెరిగి రూ. 2,796.27 కోట్ల నుంచి రూ. 3,263.05 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాలంలో మొత్తం ఖర్చులు రూ.2,957.93 కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.2,553.77 కోట్లుగా నమోదైంది.

దేశీయంగా తయారైన ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం వలన ఆదాయంలో వృద్ధి కనబడిందని కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఈ త్రైమాసికంలో ఆదాయం, లాభాలలో గణనీయమైన వృద్ధిని సాధించాం, ఇది మా ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతపై కస్టమర్ ఉంచిన నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు.

Advertisement

Next Story