ఎయిర్ ఇండియా కొత్త ఫీచర్‌.. టికెట్ ధరలను లాక్ చేసుకోవచ్చు

by S Gopi |
ఎయిర్ ఇండియా కొత్త ఫీచర్‌.. టికెట్ ధరలను లాక్ చేసుకోవచ్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రయాణికుల కోసం కొత్త కొత్త సదుపాయాలను తీసుకొస్తోంది. ఇటీవలే మహిళల కోసం ప్రత్యేక సీటు ఎంపిక చేసుకునే ఫీచర్‌ను తెచ్చిన కంపెనీ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి ప్రవేశపెట్టింది. విమాన ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న టికెట్ ధరలను రెండు రోజుల పాటు లాక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్టు వెల్లడించింది. 'ఫేర్ లాక్' పేరుతో బుధవారం కంపెనీ దీన్ని ప్రారంభించింది. ప్రయాణికులు ఇప్పుడు నామమాత్రపు రుసుము చెల్లించి రెండు రోజుల పాటు వారి ఛార్జీలను లాక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు టికెట్ ధరలు మారతాయని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కంపెనీ పేర్కొంది. సాధారణంగా విమాన టికెట్ ధరలు తరచూ మారుతూ ఉంటాయి. డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లో అయితే భారీగా పెరిగిపోయి కొనాలంటే వీలులేకుండా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఈ ఫేర్ లాక్ ఫీచర్ తెచ్చామని, ప్రయాణం చేయడానికి కనీసం 10 రోజులకు ముందు దీన్ని వాడుకోవచ్చని వెల్లడించింది. ఈ ఫీచర్ కోసం ముందుగా నాన్-రీఫండబుల్ ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి మేనేజ్ బుకింగ్స్ ఆప్షన్ ఎంచుకుని మిగిలిన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నామమాత్రపు రుసుముకు సంబంధించి దేశీయ ప్రయాణ విమానాలకు రూ. 500, తక్కువ దూరం అంతర్జాతీయ ప్రయాణానికి రూ. 850, సుదూర అంతర్జాతీయ ప్రయాణానికి రూ. 1,500 చొప్పున ముందుగా చెల్లించి టికెట్ ధరను లాక్ చేసుకోవచ్చు. అనుకోని కారణంతో టికెట్ బుక్ చేయకపోతే ఈ మొత్తం తిరిగిరాదు.

Advertisement

Next Story