తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు

by S Gopi |
తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తోంది. ఆదివారం నాటికి రద్దయిన విమానాల సంఖ్య 20కి చేరింది. అనారోగ్య సెలవులపై వెళ్లి, నిరసనకు దిగిన క్యాబిన్ సిబ్బంది అందరూ విధుల్లో చేరారని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నాటికి విమానాల సర్వీసు పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో నిర్వహణ సంస్థలు, సిబ్బందిలో కొందరిపై వివక్ష ఉందన్న ఆరోపణలతో క్యాబిన్ సిబ్బందిలోని సుమారు 300 మంది సెలవుపై వెళ్లిపోయారు. దీనివల్ల కంపెనీ అనేక విమాన సర్వీసులను నిలిపేసింది. అయితే, పరిస్థితిని అర్థం చేసుకున్న కంపెనీ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. సిబ్బందితో సానుకూల చర్చలకు సంప్రదింపులు నిర్వహిస్తూనే, తక్షణం విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సెలవు మీద వెళ్లిన సిబ్బంది మే 11 నాటికే పూర్తిగా విధుల్లో చేరారని, కానీ కంపెనీ షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్ల కొందరు సెలవుపై వెళ్లారని ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ పేర్కొంది.



Next Story