FPI: సెప్టెంబర్‌లో ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.57 వేల కోట్ల ఎఫ్‌పీఐలు

by Harish |   ( Updated:2024-09-29 09:12:49.0  )
FPI: సెప్టెంబర్‌లో ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.57 వేల కోట్ల ఎఫ్‌పీఐలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా డిపాజిటరీల డేటా చూపించిన దాని ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు సెప్టెంబర్‌ 27 నాటికి భారతీయ ఈక్విటీల్లోకి రూ. 57,359 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది గత తొమ్మిది నెలలతో పోలిస్తే, రికార్డు స్థాయిగా నిలిచింది. రూ. 66,135 కోట్ల పెట్టుబడులు పెట్టిన డిసెంబర్ 2023 తర్వాత ఇదే అత్యధిక నికర ఇన్‌ఫ్లో.

ప్రస్తుత సెప్టెంబర్ నెలలో ఎఫ్‌పీఐలు భారీ పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను తగ్గించడంతో తమ డబ్బులను భారత ఈక్విటీ మార్కెట్లోకి తరలించారు. మొత్తంగా డేటాను చూసినట్లయితే, ఈక్విటీలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు 2024లో రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. ప్రపంచ వడ్డీ రేటు సడలింపు, బలమైన ఫండమెంటల్స్‌తో భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో FPI ఇన్‌ఫ్లోలు బలంగా ఉండే అవకాశం ఉంది.

అయితే, ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిర్వహణ, లిక్విడిటీకి సంబంధించి ఆర్‌బీఐ నిర్ణయాలు ఈ ఊపును కొనసాగించడంలో కీలకం అవుతాయని స్మాల్‌కేస్ మేనేజర్, రీసెర్చ్ అనలిస్ట్ సంస్థ గోల్‌ఫై వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ రాబిన్ ఆర్య అన్నారు. సెప్టెంబర్ 18న అమెరికా ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును తగ్గించడంతో భారతీయ మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది.

Advertisement

Next Story