దళిత బంధు పథకం ఏమైంది.. ఆర్ఎస్ ప్రవీణ్

by Shyam |   ( Updated:2021-12-14 03:44:55.0  )
దళిత బంధు పథకం ఏమైంది.. ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మొదటిసారిగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఎస్పీపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పర్యటించారు. బహుజన రాజ్యం ద్వారానే మన బతుకులు మారుతాయని, రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో జిల్లాలోని చారకొండ మండలంలో రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చారగొండ మండలంలోని సిరిసనగండ్ల రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, బిఎస్‌పి నాయకులు పార్లమెంటు ఇంచార్జి బిసిమల్ల, సిహెచ్ రామన్న, జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ, నాయకులు మబ్బు మల్లేష్, అచ్చంపేట నియోజకవర్గం ఇంచార్జ్‌లు నారిమళ్ళ వెంకట స్వామి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు దళిత బంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ .10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మబలికారని, మరి నేడు ఆ పథకం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, రెండు పడకల నివాసం ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. కేవలం దొరలు బాగుపడేందుకే పాలన కొనసాగుతుందని, సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయన విమర్శించారు.

BSP

మన బతుకులు మారాలంటే..

దొరల పాలన పోయి.. బహుజన రాజ్యం వచ్చినప్పుడే దళిత, బడుగు, బలహీన వర్గాల బతుకులు మారుతాయని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. అందుకు రాష్ట్రంలో బహుజన రాజ్యం కోసం మన బ్రతుకులు మార్చేందుకు బీఎస్‌పీ పార్టీ ముందుకు వచ్చిందని, సామాన్యులు సైతం ప్రగతి భవన్‌కు వెళ్ళినప్పుడే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కావున అడుక్కునే స్థాయి నుంచి ఆశించే స్థాయికి ఎదగాల్సిన అవసరం మనకుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బహుజన రాజ్యం దిశగా ప్రతిఒక్కరం చేయిచేయి కలిపి ఏనుగు గుర్తుకు ఓటు వేసి బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కూలీలతో కలిసి పత్తి తీస్తూ..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చారగొండ మండలంలో రోడ్ షో నిర్వహిస్తుండగా మార్గ మధ్యలోని ఇర్విన్ గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీలు చేనులో పత్తి తీస్తుండగా వారి వద్దకు వెళ్లి కూలీలు పడుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా ఎంత కూలి పడుతుంది, మీ పిల్లలు చదువుకుంటున్నారా అంటూ కూలీలను పలకరిస్తూ కూలీలతో కలిసి కాసేపు పత్తి తీశారు. కూలీ బతుకులు మరింతగా మార్పు జరగాలంటే బహుజన రాజ్యం ద్వారానే సాధ్యమవుతుందని కూలీలకు వివరించారు. తదుపరి చారగొండ మండలం నుండి వంగూరు మండలానికి రోడ్ షో బయలుదేరి వెళ్లింది. ఈ కార్యక్రమంలో అరుణ్, ఆనందు, వెంకటేష్, రామన్న పెద్ద ఎత్తున బి ఎస్ పి పార్టీ కార్యకర్తలు, స్వేరోస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed