ఆ వరుడు… నవ వధువు కాళ్లుమొక్కాడు!

by Shyam |
ఆ వరుడు… నవ వధువు కాళ్లుమొక్కాడు!
X

దిశ, వెబ్‌డెస్క్: మన సంప్రదాయాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కానీ, అవన్నీ పితృస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించేలా ఉంటాయి. ‘పెళ్లి’లో పాటించే ఆచార వ్యవహారాలు సైతం పురుషాధిక్యతను నిరూపిస్తుంటాయి. అయితే ‘పెళ్లి’లో సమానత్వం తీసుకొచ్చేందుకు ఈ తరం యువకులు కొందరు పురాతన సంప్రదాయాలను, ఆచారాలను బ్రేక్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం.

‘పెళ్లి’ తర్వాత ఓ అబ్బాయి జీవితంలో పెద్దగా మార్పులేవీ కనబడవు. అదే అమ్మాయికి మాత్రం ఇంటిపేరు మారుతుంది, కొన్నిసార్లు జాతకాల పేరుతో ఒంటిపేరు కూడా మారే అవకాశం ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టిన అమ్మాయి పాటించాల్సిన కట్టుబాట్లతో పాటు పెళ్లిలో పాటించే సంప్రదాయాల వరకు అన్నింట్లోనూ ‘మేల్ డామినేషన్’ ఉంటుందన్నది పురుష సమాజం ఒప్పుకోని సత్యం. అయితే ఈతరం కుర్రాళ్లు ఆ పురుషాధిక్యతను ఖండిస్తూ, ‘ఫి’మేల్‌కొలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌కు చెందిన ఓ కొత్త పెళ్లికొడుకు.. తన పెళ్లిలో అదే చేసి చూపించాడు. సాధారణంగా మూడుముళ్లు పడ్డ తర్వాత నవ వధువు, వరుడి కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. అయితే బెంగాల్‌కు చెందిన దీపాంజన్ భద్ర మాత్రం వధువు కాళ్లకు నమస్కరించి, ఇద్దరం సమానమే అని చాటి చెప్పాడు.

స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్పుకోవడం కాదు, అది ఆచరణలో జరిగినప్పుడే సమాజంలో కొత్త మార్పులు పుట్టుకొస్తాయి, కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది. అప్పుడే నవతరం ఆ అడుగుజాడల్లో నడిచి, స్త్రీ,పురుష సమానత్వాన్ని చాటుతుంది.

Advertisement

Next Story